పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29

యనుజు లిరుప్రక్కల గొలిచియుండ విరటునిసింహాసనము పయిని ద్రౌపదీయుక్తుఁ డయి కూరుచుండెను. అటుల నున్న వారినిఁ జూచి యీవిరటుఁడు 'పాప' మెంతసత్య కాలపువాఁడో గాని వారు పాండవు లని తెలిసికొనలేక వారివలననే తెలిసికొని యానందించి యేకాకి యగు తనకుమారునితో యుద్ధమున కేగి కౌరవులను జయించి యతనిని వైరులవలన గాపాడినందున దనకుమార్తెయగు నుత్తరను నర్జునునకు సమర్పించెను. అర్జునుఁ డాయుత్తరకు నృత్యవిద్యను నేర్పినందున తాను స్వీకరింపక తనకుమారునికి జేసికొనియెద నని యా విరటు నొప్పించెను.

ఈ పాండురాజకుమారులు తమయస్త్రవిద్య సభ్యసించుటయే కాక యితరవిద్యలనుగూడ నేర్చికొనియుండినందుననే కదా యజ్ఞాతవాస వత్సరకాలమున బయలుపడక యుండిరి. కావునఁ బ్రతివారు నొకదానికంటె మించినవిద్యలను నేర్చకొని యుండవలెను. అందుఁ బ్రభువులకు గొన్నివిద్యలు వచ్చియున్నను ననేక విద్యావిషయములను దెలిసికొనియుండుట యవసరము.

ఈవిరటుఁడు - భారతయుద్ధమున బాండవులకు సేనలతో సహాయుఁడై తుదను ద్రోణునిచే సంహరింపఁబడెను. .