పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

రాజుచరిత్రమున విపులముగ విమర్శింపఁబడి యున్నది. ఆహా ! ఏమిచిత్రమో కాని పశిష్ఠునివలన నుంపఁబడిన పట్టాభిషేక ముహూర్తముప్రకారము జరగకపోవుటయే కాక శ్రీరాములవారి కతిశ్రమకరమగునరణ్యవాసము పదునాలుగువత్సరముల కాలము సంభవించెను. సర్వజ్ఞులని మనచే సమ్మఁబడియున్న మహర్షులలో నొక్కఁడగు నీవశిష్ఠుని సర్వజ్ఞత్వవిషయము విచారింపవలసి యున్నది. సర్వజ్ఞత్వమే యతనికి గలిగి యున్నయెడలఁ బట్టాభిషేకము గానేర దని ముందే చెప్పి యుండవలెను. లేక, పురోహితుఁడని యనుకొంటిమా, కైకను దనతండ్రియింటికిఁ బంపఁబడుదానినిగాఁ జేసియుండ వలెను. కావున మహర్షులకు గల సర్వజ్ఞత్వమునకు గొంత పరిమితి గలిగియుండక తప్పదు. తా నెఱిఁగియున్నవిషయములలోను స్థలములలోను గతవర్తమానకార్యములను దెలిసికొను నట్టి దివ్యజ్ఞానము తపోమహిమవలన వారికి గలిగియుండును. అదియైనను యోగశక్తిని బట్టి వచ్చిన ధ్యానప్రభావముచే గలుగునదియే కాని యెల్లప్పుడు నుండునదియును గాదు. సమస్తగోళముల యందును సర్వకాలములయందును, సర్వ విషయములయందును వ్యాపించియుండు పరమేశ్వరుని సర్వజ్ఞత్వము తదితరులకు గలిగియుండునా ? వశిష్ఠునకు దెలియనిది యుండునా? తెలిసియు నూరకయుండె నని కొంద రను