పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

71

ఓయర్జునా ! నీ విపుడు జ్ఞానులు చెప్పుమాటలను జెప్పచు దుఃఖింపఁదగనివారిని గూర్చి దుఃఖించుచున్నావు. జ్ఞానులగు వారు చచ్చినవారినిగూర్చిగాని జీవించియున్నవారినిగూర్చి గాని విచారింపరు

నేనును నీవును నిచ్చట గనిపించుచున్న యీరాజులును బూర్వము లేనివారము కాము. శరీరములు పోయినను నాత్మలు నిత్యమైనందున ముందుగూడ నుండువారమే.

ప్రతివారికిని దమశరీరములయందు బాల్యము, యౌవనము, వార్ధకము, నను నవస్థ లెట్లు మారుచున్నవో యటులనే యీశరీరము పోయినపిమ్మట గ్రొత్తశరీరములు గలుగుచున్నవి. కావున దెలిసినవారీశరీరము పోవునని దుఃఖింపరు.

ఇంద్రియములు తమతమవిషయములయందుఁ బ్రవర్తించునప్పు డావిషయభేదములనుబట్టి సుఖదుఃఖములు గలుగుచుండును గాని స్వతస్సిద్ధముగ నాత్మకు లేవు. అవి యొకప్పుడు వచ్చు, నొకప్పుడు పోవును. కావున నాసుఖదుఃఖములు శాశ్వతములు కావు. వానిని సహింపుము.

ఓపురుషశ్రేష్ఠుఁడా ! సుఖముఃఖములయందు సమబుద్ధిగల యేవివేకిని విషయేంద్రియ సంయోగములు బోధింపలేవో యతఁడే మోక్షమున కర్హుఁ డగుచున్నాఁడు.