పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

355

41వ అధ్యాయము.

తెలిసికొను నాతురతతో, వారిలోనొకడు "మహారాజా! మీకు పాలు త్రాగనిచ్చుచున్నవారెవరో గుర్తించితిరా?" అని బిగ్గఱగ అడిగెను. అందుకా సాధుపుంగవుడు హీనస్వరముతో "సోదరా! నన్నుకొట్టినయతడే నాకు పాలుపోయుచున్నాడు." అనెను. బ్రహ్మత్మైక్యజ్ఞానమును పొంది శుభా శుభములను ధర్మాధర్మములను దాటిపోయినగాని యిట్టి అద్వైత భావము అలవడజాలదు.

964. కట్టెలమ్మువాడొకడు అడవికిపోయి కట్టెలు కొట్టి తెచ్చి ఊరంతయు తిరిగి అమ్ముకొని యెట్టెటో పేదకాపురముచేయుచు బాధలు పడుచుండెను. ఒకనాడు ఆ అడవిగుండ పోవుచున్న సన్యాసి అతడు చాల కష్టపడి కట్టెలను నఱకుచుంట చూచి, అడవి లోతట్టునకు పొమ్మనియు, అటుల చేసినయెడల లాభము కలుగుననియు వానికి చెప్పెను. ఆకట్టెలమ్మువాడు సన్యాసి చెప్పినట్లు, లోనికిచొఱబడి పోసాగెను. వానికొక శ్రీగంధపుమాను కాన్పించినది. అతడు మోయ గల్గినన్ని శ్రీగంధపు చక్కలను కొట్టుకొనివచ్చి, అమ్ముకొని చాల లాభమును గడించగల్గెను. అతడిట్లు తలపోయసాగెను:- "ఆసాధుసత్తముడు శ్రీగంధపుచెట్టును గురించి మాట్లాడి యుండలేదు; అడవి లోతట్టునకు పొమ్మనిమాత్రమేచెప్పియున్నాడు." మరునాడు శ్రీగంధపుచెట్లున్నతావునుదాటి ఇంకను లోపలికి పోసాగెను. తుదకొక రాగి గనిని కాంచినాడు. తాను మోయగలంత రాగిని కొనిపోయి బజారులోనమ్మి చాల ధనమును సంపాదించెను. ఆమరునాడు రాగి గని దాపు