పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

354

నాడు. ఒడలుతెలియక ముఱికి కాలువలో పడియున్నాడు! నేనే నయము. ఒరే! నీకంటె నేనే కైపు ఆపుకొన్నానే! పడిపోకుండ తూలుతూనైన పోగల్గుచున్నాను." తుట్టతుదకొక సాధువువచ్చి ఆమహనీయుడు సమాధిదశనుండెనని గ్రహించినాడు. దగ్గఱచేరి కూర్చుండి వానిపాదములను ఒత్తసాగినాడు.

963. ఒకానొక గ్రామములో మఠమొకటి కలదు. అందలి సన్యాసులు ప్రతిదినము బిక్షాపాత్రలను చేతబూని యూరిలోనికి పోయివచ్చెడివారు. ఒకదినమున ఒకసన్యాసి యిట్లు బుక్షాటనము చేయబోయి, పేదవానినొకనిని కఠినముగ కొట్టుచున్న జమీందారుని చూచెను. దయాద్రహృదయుడగు ఆసన్యాసి వానిని కొట్టవలదని జమీందారుని బ్రతిమాలెను. మహాక్రోధముచే కన్నుగానకున్న జమీందారుడు తన కోపానలమును సన్యాసిపైకి త్రిప్పినాడు. పాపము ఆయనను స్పృహతప్పిపడు నంతగా పెడపెడ బాదినాడు. ఇదంతయు కనిపట్టి యొకమనుజుడు చచ్చఱ పర్విడిపోయి మఠములోనివారికి చెప్పెను. తక్కిన సన్యాసులు ఈసన్యాసి పడియున్నతావునకు పర్విడివచ్చిరి. వారాయనను మఠమునకు మోసికొనివచ్చి యొక గదిలో పరుండబెట్టిరి. చాలసేపటి వఱకును ఆయనకు స్మృతి తెలియలేదు. చాల విచారముతో దిగులుపడి కూర్చుండిన సోదరులు విసరుచు చల్లనినీట ముఖమును కడుగుచు ఉపచారముల సాగించిరి. కొంచెము పాలు నోటిలో పోసిరి. వారిటుల ఉపచారములుచేయగా కొంతసేపటికి ఆయనతేరుకొనినాడు. ఆయన కండ్లుతెఱచి చుట్టునున్నవారిని చూడగా, ఆయన తమను గుర్తించగలడో లేడో