పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

341

41వ అధ్యాయము.

మరునాడువాడటులనేచేసినాడు. రాజుగారి యుద్యోగులు వచ్చి రాజపుత్రికను పెండ్లిచేసికొమ్మని ఏసాధువునడిగిననను యెవడునుఒడంబడడయ్యెను. తుదకువారు సాధువేషముతోడ నున్నదొంగకడకువచ్చి తమ ఉద్దేశ్యమును తెలిపిరి. ఈదొంగ ఊరకున్నాడు. అంతటవారు రాజునొద్దకుబోయి ఒకయువకుడగు సాధువున్నాడనియు, వానిని ప్రాధేయపడి రాజపుత్రికను పెండ్లాడుటకై ఒడంబఱచవచ్చుననియు తక్కిన సాధువులు ఇష్టపడలేదనియు తెలిపిరి. అప్పుడు రాజు స్వయముగా ఈ సాధువుచెంతకుపోయి, తన కుమార్తెను పెండ్లియాడి తనను అనుగ్రహించ వలయునని అతిదీనముగా ప్రార్థించెను. రాజువచ్చి వేడుకొనుటచూడగనే దొంగవానిహృదయము మారిపోయినది. అతడిటుల తలంపసాగెను:- "నేను సాధువేషమునుమాత్రము ధరించి యుంటిని. ఆహా! రాజంతవాడువచ్చి ప్రాధేయపడుచు వేడుకొననైనది! నేను నిజముగా సాధువునే ఐనయెడల నాకు లభింపగల మహత్తర లాభములను ఎవరూహించజాలుదురు!" ఈతలపులు వానిహృదయమున గాఢముగ నాటినవి. బూటకపువేసమువేసి పెండిలిచేసుకొనుటకన్న, తనవర్తనమును మార్చుకొని, ఇక నిజముగాసాధుశీలమును అలవఱచుకొనుటయే శ్రేష్ఠమని నిశ్చయించుకొనినాడు. ఆతడు వివాహమాడ నిరాకరించినాడు; సాధువులలోనెల్ల ఉత్తమసాధువు కాగల్గినాడు. యోగ్యమైనవేషమునుధరించుట సయితము ఒకానొకప్పుడు తలవనితలంపుగా శుభప్రదము కాగలదు!