పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

322

927. బహుస్వల్పసంఖ్యాకులు మాత్రమే జ్ఞానబోధకు అర్హులుగనుందురు. భగవద్గీతలోయిట్లున్నది; వేలకొలది జనులలో ఒక్కడు భగవంతునితెలియగోరును; అటులతెలిసికొనగోరు వేయిజనులలో ఒక్కడుమాత్రము బ్రహ్మమును తెలిసికొని కృతార్థుడు కాగల్గును. కామినీకాంచనములంగూర్చి వ్యసనము తగ్గినకొలందిని జ్ఞానాభివృద్ధి చేకూరగలదు.

928. సాంసారికజీవనమున డబ్బుతోనిమిత్తమున్నమాట నిజమే. కాని దానినిగూర్చి విస్తారముగా చింతించతగదు. సంపదనార్జించు చింతకూడదు. దానంతటవచ్చుదానితో తృప్తిపడుట శ్రేష్ఠము. ధనముకూడబెట్టుకోరిక యుండతగదు. ఎవరు తమహృదయమును తమజీవనమును భగవదర్పితము చేయుదురో, ఎవరు భగవద్భక్తులై వానియందే శరణుజొత్తురో, అట్టివారలిట్టి విషయముల చింతపెట్టుకొనజాలరు. అటువంటివారి వ్యయము ఆదాయము ననుసరించి నడచును. ఒకవైపునుండి ధనమువచ్చుచుండ రెండవవైపునుండి వ్యయమగు చుండును.

929. శాక్తేయులలో సిద్ధులను శౌలులందురు. వేదాంతులు పరమహంసలనియు, బౌలసంప్రదాయికవైష్ణవులు శాయినులనియు అందురు.

930. పనులనన్నిటినివిడిచివేసి సాయంసమయమున దైవధ్యానము చేయవలయును. సంజవేళలందు సహజముగా భగవద్భావనలువచ్చును. క్షణకాలముక్రిందట సకలమును దృగ్గోచరములై యుండెనే, యిప్పుడు చీకటులచే కప్పివేయబడినవి!