పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

266

అంకురము వెలువడి మొక్కయై పంటనీయజాలదు. పంటను కోరుచో ఊకతోగూడ చెక్కుచెదఱకయున్న విత్తనమునే నాటవలయును. కాని వండుకొని తినుటకు కోరినయడల పైపొట్టును తొలగించి శుభ్రమైనబియ్యమునే చేకొనవలసియుండును. మతప్రచారమునకు, మతరక్షణకును క్రతువులు, కర్మలు అవసరములే. అవి సత్యాంకురములను దాల్చిన కర్ణికలవంటివి. కాబట్టి ఆంతర్యసత్యమును స్వానుభవమునకు తెచ్చుకొనునంతదాక, ప్రతినరుడును వానిని ఆచరించవలసినదే.

752. దీపముయొక్క స్వభావము వెలుగునిచ్చుట! దాని సహాయమున కొందఱు, తినుబండారములను వండుకొందురు. కొందఱు కృత్రిమ పత్రములను సృష్టింతురు; కొందఱు ఉత్తమశాస్త్రములను చదువుకొందురు. అటులనే కొందఱు భగవన్నామస్మరణచేసి ముక్తి పడయజూతురు; కొందఱు నీచస్వార్థములను సాధించుకొందురు. భగవంతుని పావన నామము మాత్రము అమలమై నిలిచియుండును.

753. క్రొత్తభాషను నేర్చుకొనమొదలిడిన యతడు, తన సంభాషణయందు ఆభాషాపదములను తఱచుగావాడుచు తన పాండిత్యమును ప్రదర్శించజూచును; కాని దానిని బాగుగ నేర్చినయతడు మాతృభాషను మాటలాడునప్పుడు ఆనూతన భాషాపదములను ప్రయోగించచూడడు. మతసాధనల సాధించువారిటులనే వర్తింతురు.

754. వట్టికడవలో పోయునీరు బుడబుడ ధ్వనుల కల్పించును. కాని నిండియున్నకడవలో నీరుపోసినచో అట్టిధ్వనిరాదు.