పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

267

40వ అధ్యాయము.

అటులనే బ్రహ్మసాక్షాత్కారమును పొందనినరుడు భగవంతునిగూర్చియు; వానిలక్షణముల గూర్చియు వృధావాదనలకు దిగును; బ్రహ్మసాక్షాత్కారమును పడసినయతడో ఆ దివ్యానంద పరవశుడై మౌనము దాల్చును.

755. ప్రశ్న:- నరునియందు దైవత్వము ఎంతకాలము నిలుచును?

ఉ:- ఇనుము నిప్పులోనున్నంతకాలము ఎఱ్ఱగానుండును. దానిని నిప్పులోనుండి వెలుపలికితీయగా నల్లబడును. అట్లే నరుడు బ్రహ్మభావనను అనుభవించునంతకాలము ఆదివ్య ప్రభావము కలిగియుండును.

756. గంగానదీతీరమున వసించువారు పవిత్రులు.

757. ఒకతార్కికుడువచ్చి "జ్ఞాతజ్ఞేయజ్ఞానములనగా నేమి?" అని శ్రీపరమహంసులవారి నడిగిరి. అందుకు భగవాను లిట్లనిరి.

"మహాశయా! పాండిత్యవిశేషము ప్రకటించు ఈవిషయములు నాకుతెలియవు. నాకు నాలోనిఆత్మ నాదివ్యజనని మాత్రమేతెలియును."

758. మానసతత్వ ప్రబోధముగాంచిన యతడే నిక్కువమగు మానవుడు. తక్కినవారు పేరునకుమాత్రమే మానవులు.

759. దుర్లభమగు మానవజన్మ దొఱకినను ఈజన్మను బ్రహ్మసాక్షాత్కారము పడయుటకై వినియోగించనివాని జన్మవ్యర్థము.