పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

258

నకు ఆధారమగు విద్యుచ్ఛక్తి ఒకేయంత్రమునుండి వచ్చును. అట్లే మతబోధకులు అన్నిదేశము లందును అన్నికాలములందును దీపములవలె ప్రకాశించుచుందురు. వారందఱియందును తేజరిలు ఆత్మప్రకాశము ఒకే పరబ్రహ్మమునుండి వచ్చుచున్నది.

729. కొన్నిసంవత్సరములకు పూర్వము హిందువులును బ్రహ్మసమాజమువారును అత్యుత్సాహముతో తమ తమ మత ధర్మములను బోధింపసాగగా, ఆమతముల రెండింటిని గూర్చియు మీఅభిప్రాయ మేమని ఒకరు శ్రీపరమహంసులవారిని అడిగినప్పుడు శ్రీవారిట్లనిరి:- "రెండు వర్గముల ద్వారమునను నాదివ్యమాతయే తన పనిని సాగించుచుండుట నాకు కాన్పించుచున్నది!"

730. నరులు తమ భూములను కొలకోలలతోడను, హద్దుగీతలతోడను పంపుడులుచేసికొనవచ్చును. కాని నెత్తిపైగానున్న ఆకాశము నెవరును పంచుకోజాలరు. ఆఅదృశ్యాకాశము సర్వమును ఆవరించి సర్వమును తనయందు ధరించుచున్నది. అటులనే జ్ఞానశూన్యుడు తన మూర్ఖతవలన నామతము మాత్రము సత్యమైనది; నామతమే శ్రేష్ఠమైనది అని వాదులాడును. కాని వానికి జ్ఞానప్రాప్తి కలిగినపిమ్మట ఈశాఖాసాంప్రదాయముల పోరాటములకు అతీతముగా ఏకమును, అఖండమును, నిత్యమును, చిన్మయమునగు ఒక్క బ్రహ్మమేయుండునని తెలిసికొనును.