పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

244

వంతునిపై తమ మనస్సులను నిలుప జూడకున్నారు!

వారిలో నింకొక చిత్రముకలదు. సంసార తాపత్రయములనుండి వారిని తొలగించి సజ్జనులు సాధువులు నుండు సమాజమున వేదాంతగోష్టియందు నిలిపిన యెడల వారిహృదయమునకు ఆనందమే గోచరించదు. ఎప్పుడు వెడలిపోదుమాయని తహతహపడుదురు. పెంటకుప్పలలో పుట్టి పెంటకుప్పలలో పెరుగుపురుగులు పరిశుభ్ర స్థలమున మంచి అన్నములో పెట్టినయెడల అవిబ్రతుకలేక చచ్చును గదా!

691. సాధువుచేతనున్నకమండలువు, ఆతడు తీర్థయాత్రలుచేయు, 'ధామముల' నాల్గింటిని దర్శించినను, దానిరుచి ఎప్పటివలె వగరుగనే యుండును. సంసారనిమగ్నుల స్వభామును అట్లేయుండును.

692. లౌకికపురుషులు ఐహికఫలములకు ఆశించి చాల పుణ్యకార్యములను ధర్మక్రతువులను చేయవచ్చును; కాని ఆపదలు, దుఃఖము, దారిద్ర్యమువచ్చినప్పుడు ఆభక్తి ఆధర్మచింత ఎగిరిపోవును. వారు దినమంతయు "రాధాకృష్ణా రాధాకృష్ణా" అని అఱచుచుండు చిలుకవంటివారు. చిలుకను పిల్లిపట్టుకొనినప్పుడు, అది భగవన్నామమును మఱచి "కా" "కా" అనియే అఱచును.

కావున నేనేమందునంటే అటువంటి వారికి ధర్మబోధలు చేయుట వ్యర్ధమని, నీవెన్నియుపదేశములు చేసినను సంసారులు మారరు.