పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

245

35వ అధ్యాయము.

693. క్రొత్తపరుపుమీద కూర్చుండునప్పుడు అదిఅణగును. కాని పైబరువు పోగానే అది యెప్పటి ఆకారముపొందును. గృహస్థులును అటులనే చేయుదురు. వారు పురాణశ్రవణము చేయునంత కాలమును ధర్మబుద్ధితో నిండియుందురు. ఇంటికి పోయిగృహకృత్యములలో ప్రవేశించగానె తామువినిన ఉన్నత ధర్మభావములను బొత్తుగమఱచిపోయి, ఎప్పటి నీచకార్యములకే పాల్పడుదురు.

694. లోకవ్యావృత్తులుగల పురుషులు భక్తులతోగూడి అప్పడప్పుడు ఇక్కడికివచ్చుట చూచినాను. వారికి వేదాంత ప్రసంగమనిన గిట్టదు. ఇతరులు భగవంతునిగూర్చియు పారమార్థికతనుగూర్చియు, దీర్ఘకాలము ముచ్చటించుచుండుట చూడ వారు సహించలేక చీకాకుపడుదురు. ఊరకకూర్చుండుటయు వారికి కష్టముగనుండెను. "ఎప్పుడు బయలుదేఱుట? ఎంతసేపువుంటారు?" అని తమస్నేహితులను రహస్యముగ నడిగేవారు. అప్పుడాస్నేహితులు "కొంచెము తాళుడు, త్వరలోనెవత్తుము" అనుచుంటయుకలదు. ఈమాటలకు వారు విసుగుచెంది "సరే! మీరుమాట్లాడుచుండుడు. మేముపోయి పడవలో కనుపెట్టుకొనియుంటాము" అనుచు వెళ్లెడివారు!

695. మనుష్యులలో రెండురకములవారు కలరు. పేరునకు మాత్రము మనుష్యులు ఒకరకము. ప్రబోధమానసులగు వారు ఇంకొకరకము. భగవంతునిగూర్చి తపించువారు ఈ రెండవరకములో చేరినవారు. కామినీకాంచనములకై ఆరాటపడువారు నామమాత్ర మానవులు.

-:O:-