పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

12

39. రాధ శ్రీకృష్ణుని సమీపించినకొలదిని, వాని దివ్యదేహమునుండి వెలువడు సౌరభముచేత హెచ్చుగ ఆకర్షింపబడెనీది. ఒకడు భగవంతుని సమీపించినకొలదిని వాని భగవద్భక్తియు హెచ్చుచుండును. నది సముద్రమును సమీపించినకొలదిని దానియందలి ఆటుపోటు హెచ్చు చుండునుగదా!

40. జ్ఞానిహృదయమునప్రవహించుచుండు "ప్రజ్ఞానగంగ" ఒకే దిశగా ప్రవహించుచుండును. వానికి సర్వజగత్తును స్వప్నమైతోచును. అతడు సదా తనఆత్మయందే వసించును. కాని భక్తుని హృదయమందలి "భక్తిగంగ"యో సదా ఒకేదిశగా ప్రవహించునదిగాదు. దీనియందు ఆటుపోటులును కలవు. భక్తుడు ఒకప్పుడు నవ్వును, ఒకప్పుడు ఏడ్చును, ఒకప్పుడు నాట్యముసలుపును. మఱొకప్పుడు సంగీతములు పాడును. భక్తుడు భగవత్సాన్నిధ్యసుఖమును అనుభవింపకోరును. తనప్రియునియందు లగ్నమైపోవ నభిలషింపడు. నీటిలోనిమంచుగడ్డతీరున అతడు భగవంతునిలో బడి యీదులాడుననవచ్చును. ఒక్కొక్కప్పుడు ముణుగును మఱికప్పుడు పైకితేలియాడును.

41. ఆనందము, అనగా ఆంతరంగిక పరిపూర్ణశాంతియే. భగవత్సాక్షాత్కారము కలిగినందుకు తార్కాణమగును. సముద్రమున పైభాగమునమాత్రమే అలలు సంచలనము గావించుచుండును. కాని అడుగుభాగమునందు నీరంతయు నిశ్చలముగ నుండును.