పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

1 వ అధ్యాయము.

42. ప్రశ్న:-జ్ఞానాజ్ఞానరూపములు రెండును త్యజించినపిమ్మట శేషించునదేమిటి?

సమాధానము:-అప్పుడు శేషించునది వేదములందు నిత్యశుద్ధబోధరూపముగా అభివర్ణింపబడిన అఖండబ్రహ్మము! (అదినిర్వికారము, నిష్కళంకము, శుద్ధచిత్స్వరూపమునై వెలుగును)

43. ప్రశ్న :- నేనెప్పుడు ముక్తుడనగుదును ?

జవాబు:---ఆ "నేను" అనునదిగతమైనప్పుడు.

“నేను” “నాది” అనుట అజ్ఞానము,

“నీవు” “నీది” అనుట సుజ్ఞానము.

44. మనస్సును, బుద్ధియు, మలినములై యున్నంతకాలమును బ్రాహ్మము వానికి చిక్కడు; అవివిమలములైనప్పుడు బ్రహ్మము వానికిసాక్షాత్కరించును. కామలోభములు చేరి మనస్సును మలినముగచేయును. హృద్గతమై అవిద్యరాజ్యము చేయుచుండునంతవఱకును మనస్సును బుద్ధియు శుద్ధమైనవి కాజాలవు. సాధారణముగా మనస్సు బుద్ధియు అనునవి పరస్పరము భిన్నములని చెప్పుటకలదు. కాని వినిర్మల దశయందు ఆరెండును ఒక్కటై చైతన్యమున కలసిపోవుచున్నవి. అప్పుడు చైతన్యరూపబ్రహ్మము చైతన్యమునకు ప్రత్యక్షమై కాన్పించును.

45. బ్రహ్మసాక్షాత్కారములు రెండు విధములు:--

జీవాత్మపరమాత్మలు ఏకమైపోవుట ఒకటి. బ్రహ్మమును వాని సగుణరూపముల ద్వారమునచూచుట రెండవది.