పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

200

నిదర్శనముగ జూపుచుండును. చెడ్డవారిపొత్తుగల మనస్సు, ఊహలందును సంభాషణలందును తనరంగును వెలువరించుచుండును. సాధుసంగమున కాలముగడుపుమనస్సు దైవధ్యానమునందుమాత్రమేనిలుచును. మనస్సుఎటువంటి సహవాసముచేయునో అటులనెల్ల తననైజమునుమార్చుకొనుచుండును.

573. సర్వమును మనస్సునుబట్టియేయుండును. భార్య యెడగలుగు అనురాగము ఒకరకము; కొమరితపైగలుగు ప్రేమవేఱొకరకము. ఒకనికి ఒకవైపు భార్యయు, రెండవవైపు కొమరితయునుండినచో, ఆతడు యిరువురను లాలనచేయును గాని వానిచిత్తవృత్తులు భిన్నములుగ నుండును.

బంధనము మనస్సునది; ముక్తియు మనస్సునదే! "నేనుముక్తాత్మను. నేను ఈశ్వరతనయుడను! నన్నెవరు బంధించగలరు?" అని నీవు ధిక్కరించిపలికితివా నీవుముక్తుడవే! ఒకనిని పాముకఱచినను, అతడు పూర్ణవిశ్వాసముతో దృఢముగా "లేదు, విషములేదు; లేదు!" అని పలికినయెడల వానికి విషబాధయెంతమాత్రము నుండదు.

574. జీవితకాలమంతయు పాపమనియు, నరకయాతన లనియు విలాపములు చేయుచుండుటేల? భగవన్నామస్మరణ చేసి "ఓస్వామీ! నేనుచేయరాని పనులను ఎన్నింటినో చేసితిని, చేయవలసినపనులను ఎన్నింటినో చేయకవిడిచితిని. ప్రభో! ననుక్షమింపుము." అనిఒక్కసారి పలుకుము. అటుల పలుకుచు భగవంతునియందు సుస్థిరవిశ్వాసముంచుము. నీపాపములన్ని తొలగింపబడును సుమీ!