పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

185

26వ అధ్యాయము.

భగవానుడిటుల పలికెను. "భగవదనుగ్రహమనుగాలి నీతలమీదుగా రేయింబవళ్లు వీచుచునే యున్నది. సంసార సాగరమును వేవేగమే దాటిపోగోరుదువేని (మనస్సును) నీ పడవయొక్క తెఱచాపను విప్పుము.

538. ఈశ్వరానుగ్రహమనుగాలి సతతమును వీచుచునే యుండును. సోమరులై సంసారసాగరమున నెమ్మదిగ బోవు వారలు దాని లాభమును పొందరు. చుఱుకుదనమును బలమును గలవారలు తమ మనస్సులను విప్పారజేసికొని హితకరమౌ ఆగాలిని పట్టుకొని త్వరలో తాము గమ్యస్థానమును చేరుదురు.

539. గాలి వీవనంతకాలము వేడిమి తగ్గుకొఱకై వీవనతో విసరుకొనుచుందుము; ధనికులనక, దరిద్రులనక అందఱికిని ఉపకరించు వాయువువీచునప్పుడు మనము విసరుకొనుట మానుదుము. పైనుండి చేయూత రానంతకాలము, మన పరమావధిని చేరుకొఱకు మనము తీవ్రముగ పాటుపడ వలసియుండును. అదృష్టవశమున ఆసహాయము లభ్యమైనప్పుడు మనమింకను శ్రమపడి పట్టుదలతో సాధనలుసాగించ నగత్యముండదు. అంతవఱకుమాత్రము పాటుపడవలశినదే సుమీ!

540. గాలియే వీచునప్పుడు విసనకఱ్ఱలు నిరుపయోగము. ఈశ్వరానుగ్రహము లభించినప్పుడు ప్రార్ధనలు, తపస్సులు విడువనగును.