పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

91

11వ అధ్యాయము.

266. బొమ్మలకొఱకు, డబ్బుకొఱకు పోరుపెట్టిఏడ్చుచు తల్లినిపీడించు బిడ్డతీరున, భగవంతుడు తనకు అత్యంతప్రియకరుడును ఆప్తుడును అనిగ్రహించినవాడు, వానినిచూచుటకై కపటమెఱుగని బిడ్డవలె లోలోనవెక్కివెక్కి ఏడ్చునెడల, భగవంతుడు తనదర్శనమును ప్రసాదించగలడు. తననుగురించి అంతతీవ్రముగా పరివేదనముచేయుచు వెదకులాడువారికి కాన్పించకుండ దాగియుండజాలడు.

267. మననాటకశాలలో, శ్రీకృష్ణలీలలు, ఆటాడు నప్పుడు "శ్రీకృష్ణరారా; ప్రియకృష్ణరారా!" అను పాడుచు తాళమృదంగముల తట్టుచు ప్రారంభముచేతురు. కాని శ్రీకృష్ణవేషము వేసినవాడు ఈగొడవనే వినిపించుకొనకుండ, వేషాలువేయుగదిలో కూర్చుండి పొగద్రావుచు కబర్లుచెప్పు చుండును. కాని ఈసద్దు అణగినపిమ్మట, నారదుడు రంగమున ప్రవేశించి, మృదుమధుర గానముచేయుచు, హృదయమున ప్రేమవెల్లివిరియ, వెడలిరమ్మని కృష్ణునిపిలుచుతోడనే, తానింక అశ్రద్ధతోడనుండరాదని కృష్ణుడువేగమే తెఱవెలుపలికివచ్చును. సాధకుడు పెదవులతో మాత్రమే "రారా నాస్వామిరారా!" అనిప్రార్ధనలు చేయుచుండునంతకాలమును భగవంతుడురాడు. ఆస్వామి వచ్చుతరుణమున భక్తునిఉద్వేగముకఱగి నోటధ్వనిరాక అడగిపోవును. అంతరాళమునుండి తీవ్రభక్తిపొంగి పొఱలుహృదయముతో భక్తుడుపిలుచునప్పుడు, ఇంక భగవంతుడు జాగుచేయజాలడు.