పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

92

268. జగజ్జననికొఱకు తానుపడిన పరితాపమునుగూర్చి చెప్పుచు శ్రీరామకృష్ణ పరమహంసులవారిట్లు శెలవిచ్చిరి. "దక్షిణేశ్వరాలయమునందు సాయంతనపూజా సమయమున; తాళాలు, జేగంటలు, గంటలుమ్రోగుట వినగానె, నేను గంగాతీరమునకు పర్విడిపోయి "ఓ జననీ! యింకొకదినము గడచిపోయినది. అయ్యో! ఇంకను నీవు నాకు ప్రత్యక్షము కాకపోతివి!" అనిఘోరముగా ఏడ్చెడివాడను.

269. భగవంతునియెడ మనప్రేమ ఎంతగాఢముగా యుండవలయునో, మీకు తెలియునా? పతివ్రతకు ప్రియభర్తపైనుండు ప్రేమ, లోభివానికి తాను కూడబెట్టుకొనిన ధనముపైనుండు అనురాగము, లోకులకు కామ్యవస్తుజాలముపైనుండుమక్కువ - ఈమూడునుకూడినంత తీవ్రతతో నీహృదయమున భగవద్భక్తి నిండినప్పుడు, భగవత్సాక్షాత్కారము కాగలదు.

270. ఏసుక్రీస్తు సముద్రతీరమున సంచరించుచుండగా యొకనాడు భక్తుడొకడువచ్చి "ప్రభూ! భగవంతుని పొందుటఎట్లు?" అని ప్రశ్నించినాడు. ఏసుక్రీస్తు ఆభక్తుని తోడ్కొని తిన్నగ సముద్రములోనికిదిగిపోయి వానినినీళ్లలో అణచిపట్టెను. కొంతసేపటికి వానినివిడిచి పైకిలేవదీసి "నీకుఎట్లున్నది?" అనిఅడిగెను. "నేను నాఅంత్యకాలము ఆసన్నమైనదను కొన్నాను. ఏమియుతోచినదికాదు"అనిభక్తుడు ప్రత్యుత్తరముచెప్పినాడు. అంతట ఏసుక్రీస్తు; "నీవిప్పుడు ఊపిరికొఱకై ఎట్లుపరితపించినాడవో, అంతగా ఆతండ్రిని గురించి పరితపించితివా నీకు ఆయనకానవచ్చును." అని బోధించినాడు.