Jump to content

పుట:ShivaTandavam.djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బింబారుణము కదంబించు దాంబూలంబు
తాంబూల వాసనలఁ దగులు భృంగ గణంబుఁ
గనుల పండువుసేయ, మనసు నిండుగఁ బూయ
ధణధణధ్వని దిశాతతి బిచ్చలింపంగ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

సకల భువనంబు లాంగికముగా శంకరుఁడు
సకల వాఙ్మయము వాచికము గాఁగ మృడుండు
సకల నక్షత్రంబులు కలాపములు[1] గాఁగ
సకలంబు దనయెడఁద సాత్త్వికంబును గాఁగ
గణనఁ జతుర్విధాభినయాభిరతిఁ దేల్చి
తన నాట్యగరిమంబుఁ దనలోనె తావలచి
నృత్యంబు[2] వెలయించి నృత్తంబు[3] ఝళిపించి
నృత్త నృత్యములు శబలితముగాఁ జూపించి
లాస్యతాండవ[4] భేద రచనాగతులు మీఱ
వశ్యులై సర్వదిక్పాలకులు దరిఁజేర

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

  1. భూషణము.
  2. రసభావాశ్రిత నాట్యము.
  3. చూడు. "వృత్తారంభాట్టహాస".
  4. చూడు. "శివతాండవమత, శివలాస్యంబట".