పుట:ShivaTandavam.djvu/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

ఎగుభుజమ్ములు దాచి నగుమొగమ్మునఁ జూచి
వగలురమ్మునఁ దూచి భావాభిరతి నేచి
తరళతంద్రమ్ము మధ్యమ్ము కిట కిటలాడ
వనసాంధ్యకిమ్మీర[1] ప్రభలు దనువునఁ గూడ
కుణియునెడ[2] వలయంపు మణులు చిందఱలాఁడ
కిణుకిణు మటంచుఁ బదకింకిణులు బిరుదాఁడ
శృంఖలారుండములు చెలగి తాండవమాఁడ
శంఖావదాత లోచనదీప్తి గుమిగూడ
వలగొన్న యెముక పేరులు మర్మరము సేయఁ
పులకింపఁగా నొడలు మురజంబులును మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

మొలక మీసపుఁ గట్టు, ముద్దుచందురు బొట్టు
పులితోలు హొంబట్టు, జిలుఁగు వెన్నెల పట్టు
నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు గురియు మంటల రట్టు
సికపై ననల్పకల్పక పుష్పజాతి, క
ల్పక పుష్పజాతిఁ జెర్లాడు మధురవాసనలు

  1. అనేక వర్ణములుగల.
  2. ఆడు.