పుట:Shathaka-Kavula-Charitramu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

శతకకవులచరిత్రము


పద్యములలోఁ బండితారాధ్యులవారు వ్రాసి యున్నారు. దొరకినంతవఱకు 489 పద్యము లున్నవి. ప్రతిపద్యము చివరను శివుని సంబోధించియున్నాఁడు. కాని పెక్కుపద్యములలో శివునికిఁ బర్యాయపదములగు (1) సర్వానందా (2) మహేశా (3) రుద్రా (1) అజా (5) సురమునీంద్రవరేణ్యా (6) సమస్తకామాతీతా (7) హరా (8) నిరుపమమహిమా (9) అతిలోకా (10) దురితారాతీ మొదలగుపథముల వాడినాఁడు. ఐనను “శివా” యనుసంబోధనమే హెచ్చుగా వాడినందున నిది శివసహస్రముగ వ్రాసియుండిన నుండవచ్చును. పాకృతశతకములు వ్రాసిన జైనులవాఙ్మయానుసార మిది వ్రాసియుండిన ప్రారంభశతకములలో మన కదృష్టవశమున మిగిలి యుండిన "సహస్రము” లేశ మగుటచే నిందుఁ గొన్నివిషయములు శతకవాఙ్మయారంభస్థితి నూహింప నవకాశమిచ్చుచున్నవి. ఆంధ్ర శతకములలోఁ బ్రధానప్రత్యేకలక్షణముగఁ బరిణమించిన యేకమకుటము దీనిలోఁ బ్రారంభమైనది. ఇప్పటికి మకుటము గ్రంథమంతట నొకటే యుండక సంబోధనము పర్యాయపదసూచితమయ్యు దోషములేనట్లుండుటఁ జూడ నీగ్రంథము శతకారంభస్థితినిఁ దెలుపుచున్నది. ఇందలి మకుటము పర్యాయపదసంశోభిత మగుటవలననేగాక కొన్నిఁటికిఁ బద్యమునడుమనే సంబుద్ది వచ్చుటచేతను, కొన్నిపద్యములలో సంబుద్ది లేకపోవుటచేతనుగూడ శతకమకుట మిప్పటికి స్థిరపడలేదని యీకాలమునందలి యితరశతకము లట్టివి దొరకువఱకును నిర్ణయింపవీలగుచున్నది. ఆకాలమునందును దరువాతనుగూడ నూఱుకాని నూటయెనిమిదికాని పద్యము లుండక, యధికముగ నున్నను దీనిని శతక మనియే పండితులును ప్రజలునుగూడ వాడుచుండిరి. కావున శతాధికపద్యము లున్నను, తక్కువయున్నను చాటుకృతులను శతక వాఙ్మయ మని సర్వసాధారణముగ వాడవచ్చు నని ద్యోతక మగు చున్నది. చాటుకృతులలోఁ జేరన ముక్తకాదికావ్యములు మొదలు సహస్రములవఱకు శతకవాఙ్మయమని సాధారణసాంకేతికముతో నీగ్రంథమునఁ గొన్నిచోట్ల వాడుట కిదియే కారణము. పండితా