పుట:Shathaka-Kavula-Charitramu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xlii)

కావున శతకములు ప్రచురముగాఁ గవుల స్వీయాభిప్రాయములు ప్రకటించినవి. వీనియందుఁ బాత్రలను తెఱలయడ్డములేదు. కవి భగవంతునితో ముఖాముఖి మాటలాడును. అందువలన శతకములయందు "గవిహృదయము.” సులభముగ గ్రహింపఁగల మని నా తలంపు. శతకములు కవిభావోద్రేశకమునఁ బుట్టిన "లిరుక్సు” అగుటచే భక్తి, శృంగారము, క్రోధము, భయము, అద్భుతము మొదలగు భావోద్రేకములు కలిగినప్పుడే శతకములు పెక్కుమంది రచించి యున్నారు. మహాపండితులబంధచిత్రకవిత్వశతకములకంటెఁ దప్పులకుప్పలగు బ్రావోద్రేకజనితము లగుతేటతెలుఁగు శతకరాజములే మణులవలె బ్రకాశవంతము లగుచున్నవి. వానికి మరణములేదు. మంచి యభిప్రాయముల వెల్లడించినవి.

ధూర్జటి కాళహస్తిమాహాత్మ్యముకంటెఁ గాళహస్తీశ్వరశతకము, తిమ్మకవి ప్రబంధముకంటెఁ గుక్కుటేశ్వరశతకమును, మనకు గొప్పనిధులు. వారి ప్రబంధము లాంధ్రవాఙ్మయమున లేకపోయినను నేను విచారింపను దానికి లోటులేదు.

కాని వారిశతకములు మనవాఙ్మయమునుండి తీసివేయుటవలన మనకుఁ గొంతయాస్తి తరిగిన ట్లగును.

శతకములు భావోద్రేకజనితము లనుటకు ప్రబల నిదర్శనముగ నొక్క శతకము చూపెదను. తుఱకలు సింహాచలముప్రక్క.ల దోపిడిచేయుచు వచ్చి దేవాలయమును జుట్టుముట్టినప్పుడు కోపముతో-- భయముతో --- భక్తుఁడైన గోగులపాటి కూర్మకవి "దేవుని నిందాగర్భముగ "వైరిహరరంహ! సింహాద్రినారసింహా ! " అని చెప్పిన నారసింహశతకమునందలి వాక్యముల వినుఁడు.

"పొంచియుంటివి యవనులఁ ద్రుంచుమింక ! దోలు పారసీకాధిపుల పటాపంచలుగను!
 ప్రజలఁరక్షించు యవనేశు బలముగూర్చి ! ఘనతురుష్కులఁ బడఁగొట్టమనసుఁబెట్టు!”