పుట:Shathaka-Kavula-Charitramu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xli)


వేమన తనకుఁ దాను సంబోధించుకొనఁ డనియు వాదించుచున్నారు. వేమన్న యనుపేరుకూడ నశ్వర మగుశరీరమువంటి మానవకల్పిత మగు బాహ్యశరీర సంబంధ మైనసాంకేతిక మనియు, జ్ఞాని యగువేమన్న , అజ్ఞాని యగుతనమనస్సుతో ననఁగాఁ బరమాత్మ యగుతాను జీవాత్మ యగు నజ్ఞాని వేమన్నతో నీవేదాంతము బోధించినట్లును, మనకుఁ దట్టుచున్నది. లేదా వేమన్నకే కలిగిన సందేహములను, తిట్టినయూహలను, “చెప్పరవేమా!! "చాటరవేమా!" అని తాను బ్రహ్మజ్ఞానా నందమున నోలలాడుసమయమున వినిపించిన వనవచ్చును. వేమన్నకవి వేమన్న రాజగుసోదరునిఁ గూర్చి చెప్పె ననుమాట నిలువఁ జాలదు. తనయందే యన్న “సుబుద్ధి" కీ వేదాంతమును సంబోధించి చెప్పినట్లు మనము తలంపవీలగుచున్నది. ఇందువలన శతకమునందలికవి జీవాత్మపరమాత్మలఁగూడ విడఁదీసి మేఘసందేశము నందలి యక్షుని వంటిదే జీవాత్మ యనవచ్చుననుకొందును. ఆదిగాక శివ కేశవభేదము లేని వేమన్న - "అహమ్‌బ్రహ్మస్మి" యనినయద్వైతి యగువేమన, జీవాత్మపరమాత్మలకు భేద మంగీకరింపనివేమన్న - సర్వసృష్టియు దానొక్కఁడే యనుకొనినవేమన, తన్ను తానుగాక మఱియెవ్వరి నుద్దేశించి పలుకుట కంగీకరించును? అట్టివేదాంతి కీకవిత్వమేల యనవచ్చును. గాని వేమన్న సహజకవిత్వము కలిగి పక్షివలెఁ బాడెనేకాని వ్రాయలేదు. అందువలననే యాతని శతకమునం దిన్నిభేదములు.

సులభ మైనతేటతెలుఁగులో నున్నయీజాతివేదాంతశతకములయం దనేకవైచిత్ర్యములు గన్పట్టుచున్నవి. కొందఱు వేమన స్వర్ణకారవిద్య తనశతకమునందు బోధించే నని దానికై పాట్లుపడుచున్న వారున్నారు. శతకములలో గూఢార్ధప్రతిపాదకములు, (Mythical) యంతరార్థ సంఘటితములు (allegorical) కొన్ని శృంగారరసప్రకటితములయ్యు గీతాంజలి, గీతాగోవిందములవలె నంతరార్థబోధకములుగ సాధింప దగినశతకము లున్నవి.