పుట:Shathaka-Kavula-Charitramu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xx)

ఇఁక 16వ శతాబ్దారంభమునకు వచ్చిచూతము. ఇది పోతన్నకుఁ జేరువకాలము. కృష్ణరాయభానూదయకాలము. శైవముతగ్గి వైష్ణవము హెచ్చుసూచన లున్నవి. దక్షిణహిందూ స్థానమున తురకల బాధలు కథలుగాఁ, బ్రాకుచున్నవి. రాయలవా రార్తజనరక్షకుఁడై విజయనగర సామ్రాజ్య మధిష్టించుచున్నాఁడు. కర్ణాటకరాజ్యము ప్రబలమయ్యు నోరుఁగల్లుపతనము భీతి కలిగించినది. ఆంధ్రరాష్ట్రమునుండి యనేకులు దక్షిణదేశమునకు వలసపోయిరి. వేఁగిదేశము రెడ్లు పాలించుచుండిరి. గజపతులు దండెత్తుచుండిరి. రాజ్యములు స్థాపించియుండినవి చెడినవి. కృష్ణరాయలకు రెడ్లు శత్రువులు. ఈకాలమునందుఁ గృష్ణాగోదావరులనడుమకాని, పల్నాడునందుఁగాని, బయిలుదేరిన గ్రంథములు తరచుగాఁ గనఁబడవు. ఆంధకర్ణాటక రాజ్యసమ్మేళనమొందినది. వేఁగి, కళింగదేశములు బలహీనములై రాయలకెఱగానున్నవి. వేఁగికళింగము లనేకప్రభువులపాలైయున్నవి. మహమ్మదీయులప్రచార మధికముగ లేకపోయినను, ఒత్తిడి రాజులకైనఁ గలదు.

15వ శతాబ్దాంతమున 16వ శతాబ్దాదినిఁ గల యీస్థితిలో కడపమండలము నందలి యొంటిమెట్ట రామచంద్రమూర్తిని గుఱించి రచించిన యొకశతకము ప్రసిద్ధమై కనఁబడుచున్నది. దీని సంపూర్ణ ప్రతియున్నట్లాంధ్రపత్రికలో నేను ప్రకటించియుంటిని. దీనికే జూనకీవరశతకమనియు, రఘువీరశతక మనియుఁ బేళ్లు గలవు. . అయ్యలరాజు రామభద్రుఁడు తన రామాభ్యుదయగద్యయందు "ఇది శ్రీమదొంటిమెట్టరఘునిరశతకనిర్మాణకర్మకుఁ డగు తిప్పయపౌత్రకృత మని వ్రాసికొనినాఁడు. శతకమునకే యింతబడబడలేల యని విచారింపఁ గొన్నిపద్యములే చేకురుచుండినవి. ఈశతక మిటీవల నియోగిపత్రికలో రామభద్రకృత మని పొరబాటునఁగాబోలు ప్రకటించు చున్నారు. ఇందుఁగవిత్రయప్రయోగములకు వైరుధ్యము లధికములు. కాని యీతఁడు కావ్యములు వ్రాసినందులకే యధికగౌరవ మందిన ట్లీక్రిందిపద్యము సాక్ష్య మిచ్చుచున్నది.