పుట:Shathaka-Kavula-Charitramu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xix)


తఁగా గవిత్రయవైరుధ్యము లగుప్రయోగములు కనఁబడవుకాని యీ దేవకీనందనశతకము (15వ శతాబ్దము) మొదలు "వండేనేర్పులు, అంతామిధ్య, కూడీకూడని,” మొదలగు ప్రయోగములు జన్నయ, పోతన్న, ధూర్జటి మొదలగువారు ప్రయోగించినట్లు కనఁబడుచున్నది. ఇట్టివి ప్రౌఢకవిప్రయోగములుగ లాక్షణికు లంగీకరించిరి. ప్రబంధముల యందును బెక్కులు చూపట్టెడిని. ఇవి ప్రస్తుతరచయితలకు ప్రయోగార్హ ములుగ నొనర్చుటయే లెస్సగాఁ దోఁచుచున్నది. పండితకుంజరులు నిర్ణయించెదరుగాక!

పావులూరి మల్లన భద్రాద్రిరామశతక మొండు కనఁబడుచున్నది. కాని యిదిగణితశాస్త్రకర్త రచించినది కాదని గోత్రభేదము వలనఁ దెలియుచున్నది. ఈశతకకర్త ఒంగోలుతాలూకా పావులూరి వాడఁట. క్రీ. శ. 1350లో నున్నరావిపాటి త్రిపురాంతకుఁ డంబికాశతక మొండు రచించెనుగాని యది చిక్కుటలేదు. ఒకటి రెండుపద్యములు మాత్రము శ్రీమానవల్లి రామకృష్ణకవిగారివలన మనకు లభించినవి.

ఈకవియే వ్రాసినత్రిపురాంతకోదహారణము, “చంద్రరోహిణీ వల్లభా” యనుమకుటము గలచంద్రతారావళి, యనుగ్రంథములును జాటుప్రబంధములలోఁ జేరదగినవే. పాలుకురికి సోమన్న వ్రాసిన చెన్నమల్లుసీసములు, చతుర్వేదసారసూక్తులు మొదలగు చాటుకావ్యములుగూడఁ గొన్ని కలవు.

ఇఁక సుమతిశతకము తగ వొక్కటి బ్రబలమైనది కనఁబడు చున్నది. దీనికర్తృత్వముకాని, కాలముకాని తెలియదు.

ఇట్లే భాస్కరశతకము మొదలగుకొన్ని శతకములకాలము నిర్ణయ మొనరించుటకు వీలులేకయున్నది. ఇవికూడఁ గృష్ణరాయనికిఁ బూర్వపువే యైయుండవచ్చును, 12-15 శతాబ్దములనడుమ 10-16 చాటుకావ్యములుమాత్ర మగపడుచున్నవి.