పుట:Saundarya-Lahari.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

సౌందర్యలహరి

తా. తల్లీ, నలువురురుద్రులచేతను శివునికంటె వేఱైనయేవురుశివశక్తులచేతను, తొమ్మిదిమూలప్రకృతులచేతను అష్టదళషోడశదళత్రివలయరేఖలచేతను నీకు నిలయమైన శ్రీచక్రము నలువదినాలుగంచులుగలది. శ్రీచక్రము త్రికోణాష్టకోణద్వయచతుర్దశకోణము లనియెడు నైదు శక్తి చక్రములచేతను, బిందువు అష్టదళము షోడశదళము చతురశ్రము అనునాలుగుశివచక్రములతోడను గలిగి నవచక్రాత్మకమై శివశక్త్యుభయరూపముగా వెలయుచుండునని తాత్పర్యము.

శ్లో. త్వదీయం సౌన్దర్యం తుహినగిరికన్యే తులయితుం
    కవీన్ద్రాః కల్పన్తే కథమపి విరిఞ్చిప్రభృతయః,
    యదాలోక్యౌత్సుక్యాదమరలలనా యాన్తి మనసా
    తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్యపదవీమ్. 12

టీ. హేతుహినగిరికన్యే = హిమవంతునికూఁతురగు ఓపార్వతీ, త్వదీయమ్ = నీదగు, సౌన్దర్యమ్ = సొబగును, తులయితుమ్ = మఱియొకదానితో పోల్చుటకొఱకు విరించిప్రభృతయః-విరించి = బ్రహ్మయే, ప్రభృతయః = మొదలుగాఁగల, కవీంద్రాః = కవివరులు, కధమపి = ఎటులైనను కల్పన్తే = సమర్థులగుదురా? కారు. యత్ = ఏకారణమువలన, అమరలలనాః = అచ్చరమచ్చకంటులు, ఆలోక్యౌత్సుక్యాత్-ఆలోక్య = చూడఁదగిననీసొబగునుచూచుటయందలి, ఔత్సుక్యాత్ = వేడుకవలన, తపోభిః = తపములచే, దుష్ప్రాపామపి = పొందరానిదైనను, గిరిశసాయుజ్యపదవీమ్-గిరిశ = శివునియొక్క, సాయుజ్య = సహయోగముయొక్క, పదవీమ్ = స్థానమును, మనసా = మనస్సు చేతనే, యాన్తి = పొందుచున్నారో.

తా. తల్లీ, అప్సరసలును నీసౌందర్యలేశమున కోట్యంశముననైనను సామ్యమును గనఁజాలక సదాశివమాత్రగోచరమగు నీవిలాసమును జూడఁగోరి మనస్సుచేతనే దుష్ప్రాపమగు శివసాయుజ్యమును పొందుచుండిరి. ఇట్లెల్లలోకములలో నీకీడగువస్తువులభింపమి బ్రహ్మాదులును నీసొబగును పోల్చివర్ణింపఁజాలరైరి.

శ్లో. నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం
    తవాపాఙ్గాలోకే పతితమనుధావన్తి శతశః,