పుట:Satya harishchandriiyamu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరి: అయ్యో, విప్రోత్తమా! శిక్షించుటకుఁ గాని, క్షమించుటకుఁ గాని నేనెంతటి వాఁడను. వటుశిఖామణీ! నీకిదే వందనము. (నమస్కరించును)

నక్ష: (లేవనెత్తి)

చ. కలతఁ వహింపకయ్య కల కాలము కష్టము లుండబోవు కా వలసిన కారణార్థము లవంబును దప్పునె? నా యకృత్యముల్‌ దలఁపున నుంచకయ్య విహితమ్ము ననున్‌ క్షమింపుమయ్య, నా కలుషమె యింత కింత కధికమ్మయి నన్వధియింపకుండునే?

హరి: అయ్యా! మీరు చేసిన దేమున్నది? నా పూర్వభవసంచిత పాపఫలమే నన్నీ కష్టంబులకుఁ దెచ్చె.

నక్ష: రాజేంద్రా! నిత్య సత్య సంధుడవైన నీ కెప్పటికిని గష్టములు లేవు చూడు.

మ. కడకన్‌ గావలెనంచు సత్యఫలముం గాంక్షించి నీవే యొడం బడి కైకొన్న విపత్తులం బరితపిం పన్‌ గూడదయ్యా కడుం గడుదోసంబని నేనెఱింగియు వృథా క్రౌర్యంబునన్‌ నీ యెడన్‌ జెడుగు ల్సేయుట కెంత గుందితినొ నాచిత్తంబె తా సాక్షియౌ!

హరి: నక్షత్రేశ్వరా! దుఃఖింపకుము, పరమేశ్వరుఁడు నిన్ను రక్షించుగాక. వటూత్తమా! నాకింక సెలవొసంగుఁడు.

వీర: రావయ్యా! అరిశ్చంద్రుఁడా! కుండెత్తుకుంటావా!

హరి: అయ్యా, వచ్చుచున్నాను.

వీర: అరే అబ్బిగా! మద్దాసూ! ఇంటికాడికి మనోణ్ని తీసుకుపో, బామ్మడికి సొమ్మిప్పిస్తాను.

నక్ష: (స్వ) అయ్యో! నేనెంత కపట కృత్యముల నభినయించితిని? నన్నీ యకార్యమునకు నియమించునపుడు భగవానుడైన విశ్వామిత్రుడు నేనిట్టి రట్టునకు బాలగుదునని తలంపడయ్యె గదా! ఇనుమును బట్టి యగ్నికి సమ్మెట పెట్టనట్లే గురూత్తమా! మీ వలన గదా నేనిట్టిపని కొడిగట్టవలసి వచ్చె. మీ యాజ్ఞానువర్తినై నిత్యసత్యకీర్తి యగు హరిశ్చంద్ర చక్రవర్తికి లెక్కలేని యిక్కట్టులఁ జేచేతఁ దెచ్చిపెట్టి నేను మీఁకు జెల్లించవలసిన గురుదక్షిణ నిశ్శేషముగా జెల్లించు కొంటిని గాని నేనిప్పుడన్ని విధముల దిక్కుమాలిన వాఁడనై ప్రపంచమునకు రోసి చావక బ్రతికియు