పుట:Satya harishchandriiyamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

న్నాను. ఇంకను నాకు దపం బెందులకు? ఎన్ని మన్వంతరములు తపంబొనరించినను నా యీ దుష్కృతి నిష్కృతి యగుటెట్లు? హా దీనబంధూ!

గీ. గురుతిరస్కృతి తగదనుకొనుట యొకటి యతని కార్యంబు నెఱవేర్తుననుట యొకటి యింత నిందకు నన్‌ ద్రోచె నేను జనినఁ పాయ కది నిల్చు నెన్నిక కల్పములకైన

నే నిప్పుడేమి సేయుదు? నాకింక దిక్కెవరు? నా పాపంబునకుఁ బ్రాయశ్చితమెద్ది? భగవానుఁడా విశ్వపతీ!

శా. ఏయే ధర్మము లాచరింప నగు నేయే క్షేత్రము ల్మెట్టనౌ నేయే తీర్థములందుఁ గ్రుంక నగు నేయే దేవులం గొల్వనౌ నాయీ పాపము దప్పిపోవుట కనంతా దీనబంధూ! కృపా ళూ! యాపన్నుఁడ నీ వె దిక్కగుము కొల్తున్నిన్ను విశ్వేశ్వరా!

ఇంక దుఃఖించిన నేమి ప్రయోజనము? మా యుపాధ్యాయుడైనను దురుద్దేశముతో హరిశ్చంద్రుని బాధించుచున్నా డనుకొనను. తన వైరియగు వసిష్ఠుని సాధించుటకింత సేయుచున్నాడు. ఏది యెట్లున్నను మహానుభావుడైన హరిశ్చంద్రుని దుఃఖములు తలంచినచో వజ్రకాఠిన్య హృదయములు సైతము నవనీత సమానములు కాకపోవు. పాపమా లోహితాస్యుడా కాలకౌశికుని సేవానిర్బంధములో నెట్లున్నాడో! దైవమా! సర్వదా హరిశ్చంద్రునకుఁ దోడుపడుము. (ప్రకాశముగా) వీరబాహూ! ధనమిప్పింతువు గాని పద.

వీర: అయ్యోరూ రండి.

(నిష్క్రమింతురు)

ఇది పంచమాంకము.