పుట:Satya harishchandriiyamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీర: దొరా! బానిసోణ్ణి అమ్ముతుండవా? నే గొంటానండీ, ధర చెప్పండి. నక్ష: చెప్పెదను గాని నీవు దూరముగా నుండి మాట్లాడుము. నే నిప్పుడు స్నానము చేయలేను. వీర: దూరంగానే వుండానుండి, చెప్పండి. హరి: నక్షత్రకా! నన్నీ కడజాతి వానికే యమ్మెదవా? వీర: కడజాతియేముంది, పెద్దింటోణ్ణి. నక్ష: హరిశ్చంద్రా! ఎవ్వరు గొనంకున్న నన్నేమి చేయమందువు? మొత్తము మీఁద నీవు నా కిచ్చు బత్తెమునకు దండుగ లేకుండ నా వలన బనిపుచ్చుకొనుచున్నావు. అఱచి యఱచి గొంతు పగిలిపోవుచున్నది. తిరిగి తిరిగి కాళ్ళు పడిపోవుచున్నవి. హరి: అయ్యా! వీనికే విక్రయింపుడు. నే నన్నిటికి సిద్ధుఁడనై యున్నాను. నక్ష: ఓరీ! వీరబాహూ! నీ కీతఁడు కావలయునన్న క. దంతావళంబు పయి బల వంతు డొక్కండు నిలిచి పైకిన్‌ రతనం బెంతటి దవ్వుగ రువ్వునో యంతటి యర్థం బొసంగుమా కొని పొమ్మా! వీర: ఓరబ్బో! సాలదాకుండదే! నక్ష: ఇఁక నేమనుకున్నావు? వీరబాహూ! నీచేతఁ కాదు పోరా. వీర: అయ్యోరూ! యిట్లుండానని సూత్తుండావు కామసు! డబ్బిత్తా రా, రావయ్యా అరిశ్చంద్రుడా. నక్ష: హరిశ్చంద్రా! ఇఁకబొమ్ము. నీఋణము తీఱినది. హరి: నక్షత్రేశ్వరా! నేఁనిక సెలవు పుచ్చుకొనియెద. ఎక్కడనో నిశ్చింతతోఁ దపం బాచరించుకొను నీవు గూడ నా మూలమున ఘోరారణ్యములఁ బడరాని పాట్లు పడితివి. క్షమింపుఁడు. వటూత్తమా! నమస్కారము. నక్ష: (స్వ) అయ్యో! నే నిప్పుడేమని యీ ధర్మమూర్తికిఁ బ్రత్యుత్తర మిచ్చెదను? ఇట్టి పరమ శాంతుని సత్యవంతుని నేనెంతఁ జేసితిని. (ప్రకాశముగా) హరిశ్చంద్రా! నేనే నీ కన్ని విధములఁ గష్టములఁ దెచ్చి పెట్టిన దుష్టుఁడను. నేను నిన్నడుగు కొనవలసిన క్షమాపణములు నీవు నన్నడుగు కొనుచున్నావు. అయినను బుట్టినదాదిననన్య సామాన్యమైన సత్యనిష్ఠాగరిష్ఠతచేఁ బరిశుద్ధమైన నీ మానసమున కింతటి క్షోభ దెచ్చి పెట్టిన నాయట్టి ఘోరకర్ముడు శిక్షార్హుండు గాక క్షమాపణమునకు దగునా?