పుట:Satya harishchandriiyamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముని ఋణమునకు మీరు మీరును బెనంగి తుదకు నే గంగలోనైన దుముక బొండు (పోవుచున్నాడు)

హరి: (చేయి పట్టుకొని) నక్షత్రకా! నీకిది బొత్తుగాఁ దగనిపని.

నక్ష: ఏమోయి చేయి పట్టుకొనుచున్నావు? నన్నుఁ గొట్టుదువా యేమి?

హరి: అయ్యా! నేనంత సాహసిని గాను.

నక్ష: కాకున్న నా చేయి విడువుము.

హరి: విడిచితిని. ఇంక నా సొమ్ము మీ గురువున కిచ్చి వేయుము.

నక్ష: హరిశ్చంద్రా! నే నిన్ని మాటలవాఁడను గాను.

క. అడియాస విడువు మిఁక నా యొడలన్‌ జీవంబు లున్న వొదమిన్‌ విడువన్‌ జెడనెంచి తేని నినునా బొడ నీ యడిదమున గోయ మీఁరో గొనుమీ.

హరి: నక్షత్రకా! ఇంతకన్న నేఁ జెడునదేమున్నది? నన్ను గూడ నమ్ముకొని మీ గురువు ఋణంబు రాబట్టుకొనుము.

నక్ష: నిన్నెవ్వరిచ్చటఁ గొందురు?

హరి: ఎవ్వరు గొనకున్న గడకుఁ గడజాతివానికైన నమ్మివేయుము.

నక్ష: సరి నిన్ను గాదననేల. (నడచును) (ద్విపద - కీరవాణి రాగము - ఆది తాళము)

 	అవధారుఁడయ్య యో యగ్రజులార

సవన దీక్షితులార క్షత్రియులార ద్రవిణేశు మించు నుత్తమ వైశ్యులార ప్రవిమల గుణగణ్య పాదజులార కడలాక్రమించి యొక్కట భూమి నేలి సడినున్న యా హరిశ్చంద్రుడు నేఁడు బానిసీడుగ నమ్మంబడుచున్న వాఁడు మాననీయుడు సత్యమార్గ ధీరుండు