పుట:Satya harishchandriiyamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నక్ష: అడవులలో నన్నిన్నాళ్ళన్నమునకు నీళ్ళకును మొగము వాచునట్లు చేయుట నీది యన్యాయము కాదు గాని న్యాయముగా నాకు రావలసిన బత్తెము నేను తీసికొనుట యన్యాయ మయ్యెనేమి? యెట్లు?

ఉ. బత్తెము లేక త్రోవల విపత్తుల కోర్చుచుఁ దిండి కేనియున్‌ బొత్తుగా వాచిపోయి గృహమున్‌ విడి నీ వెనువెంట రాఁగ నీ తొత్తునె యింతకంటెను గతుల్మఱి మాకిఁక లెవె యేరికిన్‌ మెత్తనివానిఁ జూచు నెడ మిక్కిలి మొత్తగఁ జిత్తమౌఁ గదా!

హరి: నక్షత్రకా! మీ గురువుగారి పనిమీద నీవు నా వెంట వచ్చితివి కాని, నా కొఱకై వచ్చితివా? నా వలన బత్తెమే నీవు తీసికొనిన నీవు నీ గురువునకు జేసిన యుపకారమేమున్నది?

నక్ష: ఓయి దుర్మార్గుడా! ఏమన్నావు? నేను నా గురువునకు జేసిన యుపకారమేమనియా?

ఉ. ఆస దొరంగి ప్రాణముల కైన దెగించుచు నిట్టి బత్తెపుం గాసుల నాసచే దరువు కానిగ నీ పయి ఘోరకాననా వాస మొనర్చ నొప్పుకొని వచ్చుటె నాయుపకార మాతపో భ్యాసికి నా వలెన్‌ వటుఁడెవం డిటు నెత్తురుకూటికొప్పెడిన్‌

ఇప్పుడు నా గురుభక్తిని గూడ నధిక్షేపించుచున్నావుగా? నీ వేమైన ననుము. నీ భార్య నమ్మగా వచ్చిన ధనము బత్తెము క్రింద జెల్లవలసినదే. కాన నిక మా గురువుగారి ఋణమిప్పుడే యిచ్చివేయుము.

హరి: వటూత్తమా! నేనిప్పుడింత ధనమెక్కడినుండి తెత్తునయ్యా?

గీ. విమలశీలను నిల్లాలి విక్రయించి చేర్చిన ధనంబు నీ చేత జిక్కెను గద అవని స్వశరీరమాత్ర వైభవుఁడ నగుచు బ్రతుకు చున్నట్టి నేనెట్లు బత్తెమిత్తు?

నక్ష: నీ విట్టి నిర్భాగ్యుడ వనియే నేను దీపముండగనే చక్కంబెట్టుకొన్నాఁడ. ఓ హరిశ్చంద్రా! ఇటు వినుము.

గీ. నీకు రానున్న బత్తెంపు రూకలెటులో స్వీకరించితి నే నిల్లు సేరవచ్చు