పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రజము నీయింటి నలంకరింపజేయదని తెలియుము. గురువునాజ్ఞనుల్లంఘించుటకంటె గురుతరపాపము లేదని నమ్ముము-ఇతి నా రా య ణ స్కృ తి." అని ఇట్లువ్రాసినారుగదా! నేను చేయునదేమి? ఆచార్య ద్రోహము చేయవచ్చునా? రేపుప్రొద్దున బహిష్కారము చేసినచో నాతండ్రిగారి శ్రాద్ధము నెట్లుచేతును? మఠము వారలెవరు మనయింటికి వత్తురు?

లీల:--కొన్ని ధర్మశాస్త్రములలో అట్లుచేయనక్కరలేదు, విధవలు మరల పెండ్లి చేసుకొనవచ్చుననియు చెప్పినారుగదా? ఇదిగాక, మీగుమాస్తా శ్రీధరుడుగూడ బ్రాహ్మణుదేకదా! చూడండీ! ఆయన, తనతల్లి విధవయైనను వెంట్రుకలు తీయించకుండ ఎన్నిదినములనుంచి పెట్టినాడో! వారింటికి బ్రాహ్మణులు పోవుచునేయున్నారే?

భీమ:-- శ్రీధరుడా! వాడు స్మార్తుడు. ఈపిల్ల ఇట్లుండుటంబట్టియే మనఇంటికిరాను విద్యాలంకారాచార్యులుకూడ సంకోచించు చుండగా, ఎంతోడబ్బు ఎక్కువగానిచ్చి సరిచేసికొంటిని.

లీల:-- ఐతే స్వాములవారికిగూడ డబ్బు ఎక్కువగానిచ్చి సరిచేసికొనరాదా?

భీమ:-- అది సాధ్యముకాదు. బహిరంగముగా అనాచారము జరుగుట స్వాములవారు ఒప్పరు.

లీల:-- పొనిండు, ఆపిల్లను ఎక్కడికైనను పంపివేయుదము.

భీమ:-- అదియెట్లుసాధ్యము? నాఅక్క బావగార్లు గతించినప్పుడు ఈపిల్లను నాచేతబెట్టి, నీవే దానికి తల్లితండ్రి యనిచెప్పి చేతిలోచెయ్యి వేయించుకొని నారే? దాని సుఖదు:ఖములు నేను చూసుకొనకపోయిన మరెవరు చూచెదరు? నేనే దానికి పెండ్లి చేసినది. ఇప్పుడును నేనే దానిని సంరక్షణ చేయవలెను.

లీల:-- ఆ! పెండ్లిచేసితిరి! అరువదియేండ్ల ముదుసలివానికిచ్చి, నేనప్పుడే వలదు, వలదు, అని అంటిని.