64
శారదలేఖలు
పుస్తక భాండాగారము. ఈ గ్రంథాలయమున అసంఖ్యాక తాళపత్ర గ్రంథము లుండుటచే కవులకు, పండితులకు చారిత్రక పరిశోధకులకు నిది పెన్నిధిగా నున్నది. అచ్చట కొంద ఱుద్యోగులుండి శిథిల గ్రంథములకు ప్రతులు వ్రాయుచున్నారు. మఱికొంద ఱేకాంతమున గూర్చుండి ప్రాచీనగ్రంథ శోధనము గావింపుచున్నారు. వారు బహుశః గ్రంథపరిశీలనకై గ్రామాంతరములనుండి వచ్చినవారై యుండనోపు. ఈ విధముగ సరస్వతీమహలు ఖిలములై జీర్ణములై పోయిన పూర్వరాజ చరిత్రములను కవి పండిత జీవితములను నెఱుకపరచు భారతీయులకు ముఖ్యముగా దక్షిణహిందూ దేశీయులకు నమూల్య ప్రయోజనము గలిగించుచున్నది. తంజావూరు పాలకులలో మన తెలుగువారు కూడ నుండుటచే ఆనాడు వారువ్రాయించిన గ్రంథములు శాసనములు మున్నగునవి మన ఆంధ్రులచరిత్రము నెఱుగుట కెక్కువగాఁ దోడ్పడుచున్నవి. మిత్రమా! తంజావూరియందు మన ఆంధ్రులుచూచి సంతోషింప వలసిన విశేషములు పెక్కులున్నను దురదృష్టవశమున ఆనాడు వానయధికముగా నుండుటచే తనివిదీర చూడజాలక పోతిమని తెల్పుటకు చింతిల్లుచున్నాను. అటనుండి మధురకు వెళ్లితిమి. మధుర ప్రాచీన నగరము. పాండ్యరాజులకు రాజధాని. మధురలోని మీనాక్షీ దేవ్యాలయము సుప్రసిద్ధమైనది. అచ్చట దేవికే ప్రసిద్ధి యెక్కువకాన మీనాక్షి సుందరేశ్వరుని భార్య యనరు. మీనాక్షీ దేవ్యాలయ మొక మహానగరమువలె నున్నది. ఆ యాలయ పుణ్యస్థలమున లేని వస్తువులేదు.