Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

శారదలేఖలు

చూడగల్గు భాగ్యము కడు సమీపస్థులకేగాని యన్యులకు కలుగుట బహుదుస్తరమయ్యెను. విశాలమైన యాసభాశాలలోని స్తంభములకు “నిశ్శబ్దము” అని వ్రాసి కట్టబడిన యట్టలు మాత్రమే నిశ్శబ్దముగ నుండెనుగాని ప్రజలుమాత్రము నిశ్శబ్దముగలేరు. ఆఘోష సముద్రపుఘోషకన్న పదిరెట్లధికముగ నుండెను. మన ఆడవారి సంగతియడుగఁ బని లేదు గదా! కుశలప్రశ్నలక్కడ, నగలపరిశీలన ప్రసంగములక్కడ, వంటప్రస్తావనలక్కడ, పెండ్లిముచ్చటలక్కడ సరి, ఇఁక పిల్లలయేడుపు ఉండనేయున్నది. తల్లులు తమకుతూహలము కొఱకు శిశువులను జనసమ్మర్దములోవేసి నలిపివేయుచుండ వారు రోదింపకెట్లుందురు? కాని స్త్రీలుచేసిన సందడికంటె చదువులకుఁ జేరిన యే యడ్డులేని మగబిడ్డల యల్లరియే యత్యధికముగానుండి యనేకమాఱులు కార్యక్రమమునకు భంగము కలిగించెను. శారదాలయమువారు మొదట నిర్ణయించిన టిక్కెట్లపద్దతి యూరిలో నలజడికి గారణ మయ్యెనేగాని సభలోని యలజడి మాన్పుటకేమాత్రము తోడ్పడలేదు. ఈ ఘోషచూచిన తరువాత ననేకులు టిక్కట్లు పెట్టిననే బాగుగానుండునేమో యనుకొనిరి. బాలిక లెన్నిదినములనుండియో శ్రమపడి నేర్చినదంతయు జనుల కలకలముచే వ్యర్థమైపోయినప్పుడు నాకెంతయో విచారముగొల్పెను. శ్రమపడి నేర్చినవారికిని నేర్పినవారికిని నెంత మనస్సునొచ్చెనో!