శారదలేఖలు
181
ఎప్పుడును ఆడుదానికంటె మగవానికి కూలియెక్కువ. అయితే ఆడుదానికూలి యింటికి జేరినట్టు మగవానికూలి చేరదు. అది ముక్కాలు మువ్వీసము కల్లంగడికే. ఒక్క ఆడుదాని కూలి కుటుంబపోషణకు చాలదు. మగవానికూలి కల్లుపాలవును. అట్టిచో ప్రొద్దున ప్రాచిమొగాన పాటుకువెళ్లి చేతిబిడ్డను చెట్టు కొమ్మకుగట్టిన గుడ్డఉయ్యాలలో పడవేసి యెడపిల్లలను కంచెల వెంబడి కఱ్ఱలవెంబడి తిరుగవిడిచి పగలెల్ల కష్టపడిన ఆపేదరాలి క్షోభ యెట్లుండునో చెప్పవలెనా? అది యటుండ ఆ చాలియు చాలని గంజియైన త్రాగుదుమని నమ్మకములేదు. తప్పతాగిన ఆధూర్తుడు అకస్మాత్తుగావచ్చి యింటిమీదపడి ఆగమునకు దొరకొనును. పెండ్లామును చావమోదును. బిడ్డలను జావమోదును. కూటికుండలు బోర్లదోయును. ఇఁక ఆనోటి కడ్డదిడ్డములు లేవు. వినరానిబూతులు. అట్లు ఇంటికిరాకపోయినా? కంచెలోనో కంపలోనో పడినాడనియో, రోడ్డుమీద దొర్లుచుండగా కానిస్టేబులు స్టేషనుకు యీడ్చుకొనిపోయినాడనియో కబురు. వానికొఱకు మరల పెండ్లాముపరుగు. ఏఱాయియైన నేమి పండ్లూడగొట్టుకొనుట కన్నట్టుగా సంసారములోని శాంతిని చెఱచుట కేయల్లరియైనను నొక్కటేగదా ?
మిత్రమా! సాయంత్రపువేళ పేదవారి గిడిసెల దెసకేగి చూచితిమా ఇప్పగిది మద్యదేవతకు బలియై క్షోభిల్లెడి సంసారములెన్నియో హృదయవిదారకముగా గననగును.