180
శారదలేఖలు
క్లేశములకు మితిలేదు. నేనొక్కదానినైతే ఎట్లాగో తినో, తినకో ఏడుస్తును. కడుపులో కాళ్లుముడిచిపెట్టుకొని పడుకోకుండా పిల్లలు నల్గురు; తెల్లవాఱిలేచినదిమొదలు యెన్నివిధముల తంటాలు! ఇంటికర్చునిమిత్తము నాచేతిలోకొక్కొక్క రూక రాలుటకెంతయో శ్రమ. కాని ఆసీమ సారాయములు సడీచప్పుడు లేకుండా వందలకొలది రూప్యములను కబళించి వేస్తుంటాయి. సొగసైన మాదిరులలో అందమైన బిరడాలతో మా బీరువల నలంకరించే ఆ నిర్జీవపు సీసాలలో తమ్ము కొన్న యజమానునేగాక కుటుంబాలు కుటుంబాలు కూల్చివేసే అద్భుతశక్తివున్నది. శారదా! నీవాకథ చదువుటచే నాకథయే నాకు జ్ఞాపకమువచ్చి యింత దుఃఖమువచ్చినది. ఏమిచేయను? ఆపుకోలేకపోయినాను” అని నామిత్రురాలు మరల నధికముగా విలపించెను. కల్పలతా ! నామిత్రురాలు పేదరాలుగాదు. గొప్పయింటిబిడ్డ; మంచివిద్యావతి. ఆమె యొడలిపై విలువగల నగలున్నవి. ఆమె కట్టుకున్నది బెంగళూరుపట్టుచీర. ఆమె పెనిమిటి విద్యాధికుఁడు. ఉన్నతోద్యోగి. పైకిచూచువారి కామె గొప్పయదృష్టశాలినివలెనే కాన్పించును. అయిననేమి ? భర్త యలవాటుపడియున్న సీమసారాయము లామె నెంతపరితప్తమానసనుగా జేయుచున్నవో కనుము.
త్రాగుబోతుదనముచే శ్రీమంతులైనవారి స్థితియే యిట్లుండ ఇక పేదకుటుంబినుల నిది యెంతదుఃఖపెట్టు చున్నదో చెప్పవలసినదేమి? పేదవారల పూరిగుడిసెల నొకపరిచూడుము.