Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

శారదలేఖలు

అంతదూరముపోనేల? మాపనిమనిషిమగఁడును, దొడ్డినూడ్చుదాని మగడును ఇద్దఱు త్రాగుబోతులే. తమభర్తల దుర్వృత్తినిగూర్చి దినదినము వారు పెట్టెడిఘోష విన శక్యముగాదు. వాళ్లు చెప్పి చెప్పి, యేడ్చి యేడ్చి తుదకు తమనెలజీతము తమమగమనిషికి మాత్రమీయవద్దని చెప్పుచుందురు. అటులనేయని నేనెన్నడును వాళ్లభర్తల పరముగా జీతమీయను. కల్పలతా ! త్రాగుడు పేదస్త్రీలను, ధనికస్త్రీలనుగూడ నిన్నివిధములు హింసించుచుండ నిషేధప్రచారము స్త్రీల కావశ్యకములేదని యెట్టుచెప్పనగుసు? మిత్రమా! నిజముగా త్రాగుబోతులు త్రాగుచున్నది భార్య, బిడ్డల రక్తముగాని మద్యముగాదు. దొరతనమువారి మహౌదార్యమువలన గాని మహాత్ములైనవారి నిరంతరకృషివలనగాని మద్యమును నిషేధించుభాగ్యము మన భారతదేశమునకు గల్గెనేని మన స్త్రీల పుణ్యము ఫలించినదనియే చెప్పవలయును.

గతవత్సరము దొరతనమువారు మన చెన్నరాజధాని యందు కొన్నిలక్ష (నాల్గులక్షలని జ్ఞాపకము) లొసగి మద్య నిషేధక ప్రచారకసంఘములు నెలకొల్పినపుడు త్రాగుబోతు పతులచే వెతలబడుసతుల యాపదలు తీఱెడిభాగ్యము లభించెనని యెంతయోసంతసించితిని. అయితే ఆ టెంపరెన్సుకమిటీ లింకను జీవించియుండగనే అదేప్రచారమునకు పూనుకొనిన అసంఖ్యాక భారతీయ నరనారీమణులు చెఱసాలలలో ముఱుగుచున్నారు. పరస్పర విరుద్ధమైన యీకార్యమునకు హేతు