శారదలేఖలు
161
సౌభాగ్యవతియగు కల్పలతకు: -
నెచ్చెలీ !
అవును నేనుగూడ నదియే విషయమై యోచింపుచున్నాను. విచారించిచూడ ఈ పెండ్లిండ్లరద్దుచట్టము నామోదించుటలో నామోదింపకుండుటలోగూడ ఇబ్బందులే కనుపడుచున్నవి. ఇది శారదాచట్టమువలె సులభముగా నామోదింప దగినదికాదు. దీని నామోదించితిమా భారతమహిళల నిరుపమానశీలముచే సముపార్జితమైన జగద్వందిత కీర్తికి కళంకమొదవెడు పరిస్థితు లేర్పడవచ్చును. మఱియు అవమానము, క్లేశము, చింత, మున్నగు కష్టములకు స్త్రీ గుఱికావలసి వచ్చును. కాదంటిమా? నిర్హేతుకముగా భర్తృపరిత్యాగినులైన స్త్రీల దుర్గతికి తరణోపాయము దోచుకున్నది. కాన ఈ విడాకులచట్ట మొకవంక స్త్రీలకు ఆత్మహత్యాకరముగను మరియొకవంక ప్రాణదానకరముగను కనుపించు చున్నది. దీని నింకను నిదానించి విచారించ నగును.
ఒక రొక మంచి పనిని చేయుచున్నచో వారితో సరిదూగుటకు మనము యత్నించుట తప్పుగాదు. కాని చెడుగునకు గూడ పోటీబడుట యుక్తమనిపించుకొనునా? పురుషులు భార్యను పరిత్యజించుట యనుచితకృత్యమని మనమిప్పుడు భావింపుచున్నాము. భావనమేగాదు. అందులకు వారిని కఠిన