శారదలేఖలు
131
యెప్పుడు జరిగిననప్పుడే చూడవచ్చునని తేదీ తెలియకనే నేను బెజవాడ వెళ్లితిని. మఱునాడే సభ. నే నేకొంచెమాలస్యము చేసినను మహిళాసభను గాంచెడి భాగ్యము గల్గెడిది కాదు. చాలామంది కట్టి యాశాభంగముకూడ గల్గెను.
ఆరేయి గడచెను. ఉదయమేలేచి ప్రాతఃకృత్యముల నిర్వర్తించుకొని దాదాపు ఎనిమిదిన్నర గంటలవేళ మహిళాసభ జరిగెడి దుర్గావిలాసమున కేగితిమి. అక్కడ సభల సందడేమియు కాన్పింపలేదు. ఆ పెద్దహాలులో కొద్దిమంది స్త్రీలు ఒకమూలకుప్పగా గూర్చుండియుండిరి. "తొమ్మిదిగంటలు కావచ్చినది. సభానిర్వాహకురాండ్రేరి? ఆహ్వానసంఘాధ్యక్షురాలెక్కడ? అధ్యక్షురాలు వచ్చెనా? యని అక్కడివారి నడిగితిని. "అధ్యక్షురాలిని తోడ్కొనివచ్చుటకు స్టేషనుకు వెళ్లినారు. కూర్చోండి. వస్తారు” అని అక్కడ నున్న వారనిరి. సరేనని నేనును మాబంధుస్త్రీలును కూర్చుంటిమి. తొమ్మిదయ్యెను పదియయ్యెను పదునొకండయ్యెను. జాడలేదు!! సభలకై వచ్చి కృష్ణస్నానమున కేగినవారును, కనకదుర్గను జూడనేగినవారును, పురుషుల సభలో జరిగెడిపతాకోత్సవమును జూడనేగినవారును, యుస్సురస్సురనుచు రాసాగిరి. ఇంకను విషయనిర్ణయసభకొఱకు కూర్చుండుట అనవసరమే గాదు దుర్భరమే యనిపించెను. చల్లగా నింటికి వెళ్లిపోతిమి. దాదాపు పదిరెండుగంటల వేళ ముత్తులక్ష్మిరెడ్డిగా రరుదెంచిరనియు విషయ నిర్ణయముల విషయమై సమాలోచన జరిగెననియు వింటిని.