Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

123

చము వారిని సన్మానించును. ప్రతిఫలరహితమైన ఉపకృతి, ప్రతిఫలరహితమైన వదాన్యత, యుత్తమోత్తమములు. మనుజులు కీర్తికాములగుటగూడ యొకలోపమే. కోరకయే మేఘుడు వర్షించినట్లు, వేడకయే పవనుడు వీచినట్లు, ప్రార్థింపకయే సూర్యుడు వేడివెల్గుల ప్రసాదించినట్లు జనులు స్వధర్మ నిరతులు కావలెను. కృషికి ప్రతిఫలము కోరుట యుత్తమగుణము కాజాలదు. ప్రతిఫలాకాంక్షలేని సేవాపరాయణులను లోకమే గుర్తించి మన్నించును. బాలగంగాధరతిలకునకు లోకమాన్య బిరుదము నేసభవా రొసంగిరి? మోహనదాసు కరంచందుగాంధికి మహాత్మ బిరుద మేసన్మానసభ యొసంగెను? కాన మహనీయులకు అల్పసంఖ్యాకులకూటములు మాత్రమేయగు సభలలో బిరుదులు సమర్పింపబడ నక్కఱలేదు. అవి తమకుఁ దామైవలచి వారిని జెందును.

ఏ యుద్దేశముచేతనో మన ఆంధ్రదేశమునందలి సమావేశములు, కొన్నివత్సరములనుండి దేశములో పెద్ద పెద్దలకు సన్నదులొసంగుట సాగించినవి. ప్రమాదమో బుద్ధిపూర్వకమో అందు స్త్రీలుమాత్ర మింతవఱకు చేరలేదు. అందులకు నాకు సంతోషమే యగుచున్నది.

ఈ బిరుదులపై పిచ్చి మనకే గాదు నాగరకరాజ్యము లని పేరొందిన పశ్చిమఖండములోగూడ బిరుదులపై వ్యామోహ మధికముగానేయున్నది. ఈ బిరుదులు బడయుటకై వారు పలుపాట్లు పడుదురట. ఈ సందర్భమున నేటి