Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

117

సౌభాగ్యవతి కల్పలతకు : -

నెచ్చెలీ !

నీవు వ్రాసిన జాబు చూచితిని. అందు నీవు “ఇటీవల జరుగుచున్న ప్రతిసభలోను పురుషులకు గౌరవబిరుదు లొసంగుచు స్త్రీల కొక్కరికైన నీయక ఆంధ్రమహాజనులు స్త్రీలను చిన్న చూపు చూచుచున్నారు. చూచితివా? బిరుదు లందు కొనదగిన విదుషీరత్నము లాంధ్రస్త్రీలలో లేకనా? లేక స్త్రీల యెడగల నిరసనభావమా? ఏది దీనికి కారణము? ఇప్పటి పురుషులకు స్త్రీలయందు గౌరవభావ మేర్పడుచున్నదని నీవు వాదింతువుగాని నేను నమ్మను” అని నీవు వ్రాసిన వాక్యములు నా కెన్నిమాఱులు తలఁచిన అన్నిమాఱు లత్యధికముగా నవ్వు వచ్చుచున్నది. నీకుగూడ బిరుదులపిచ్చి యున్నదా యేమి? నంద్యాలసభలకు పూర్వ మొకపత్రికలో చదివితిని లెమ్ము. ఇంతకుపూర్వ మిచ్చిన బిరుదులన్నియు బ్రాహ్మణులకే చెందినవి. ఈమాఱు బ్రాహ్మణేతరులకుగూడ నొకబిరుదు నిచ్చుట యవసరమని అందు వ్రాయబడినది. అదిచూచి అర్హతానర్హతలను పరికింపవలసిన వాటికి బ్రాహ్మణ బ్రాహ్మణేతరభేదములు తీయబడుచున్న వేమని విచారించితిని. ఇప్పుడు నీవు స్త్రీ పురుష భేదములను గొనివచ్చితివి. బిరుదులపై మోహముగలవారు స్త్రీలలోగూడ నున్నారని నీ యుత్తరముచూచి ఆశ్చర్యముతో ననుకొంటిని.