పుట:Saptamaidvardu-Charitramu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి అధ్యాయము.

3

మొదటిహెన్రి ప్రభువునకు మటిలాయందు జననము నొందినరెండవహెన్రి ఇంగ్లండునకు నేలిక అయ్యెను. అతని దొరతనమున నింగ్లండు కొంతవృద్ధికి వచ్చెను. అతనికి మొదటిరిచ్చర్డును జాననునాతఁడు ననునిరువురు కొడుకు లుండిరి. కాని రిచ్చర్డునకు సంతతిలేనందున నాతనితమ్ముడు జాను రాజ్యమునకు వచ్చెను. ఇతనికాలమున నింగ్లండుజనుల కోరికప్రకార మాదేశపురాజు దొరతనము సేయుటకు నారంభించెను. అనఁగా అప్పుడు రాజునకు కలనిరంకుశాధికారము ముగిసెను. జనులకు నీహక్కు ఇతనికి ముందు లేదు. జానుప్రభువునకు మూఁడవ హెన్రియు నాతనికి మొదటియెడ్వర్డును ఆయనకు రెండవ యెడ్వర్డును అతనికి మూఁడవయెడ్వర్డును బుట్టి యింగ్లండు నేలిరి.

మూఁడవయెడ్వర్డు ఇంగ్లండును ఏఁబదియేండ్లు పాలించెను. అతనికి రెండవరిచ్చర్డు పుట్టెను. ఈరిచ్చర్డు దేశము నిరువదిరెండేండ్లేలి మిక్కిలిదుష్టుఁడ్రైనందున నితనితమ్మునికొడుకు నాలవహెన్రి, వానిని జంపి యింగ్లండుదీవికి నధిపతి యాయెను. ఈహెన్రి లంకాస్ట్రియను వంశస్థులలో మొదటివాఁడు. అతఁ డింగ్లండునఱువది రెండేండ్లేలెను. అతనియనంతరమున నైదవ హెన్రియు నాతనివెనుక నాఱవహెన్రియును రాజ్యమునకు వచ్చిరి. కాని నాలవయెడ్వర్డు ఆఱవహెన్రీని దఱిమి తాను రాజ్యము నాక్రమించుకొని ప్రభుత్వము సేయఁ గడంగెను.