పుట:Saptamaidvardu-Charitramu.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

సప్తమైడ్వర్డు చరిత్రము

నింగ్లీషువా రని పేరు వచ్చెను. వా రింగ్లీషు భాషను మాటాడిరి. వా రాదేశమునఁ జిన్న చిన్న రాజ్యములకుఁ బ్రభువు లై ఆయారాజ్యములను బాలించు చుండిరి. వారు రోమనుపురినుండి ఇంగ్లండునకు వచ్చినక్రైస్తవ మతబోధకుల బోధనలను విని క్రైస్తవ మతము నవలంబించిరి.

ఈ యింగ్లీషువారు ఇంగ్లండునఁ జిన్నచిన్న రాజ్యములకు నధిపతులై యుండినపుడు అయిరోపాలో నుండుడెన్మార్కు రాజ్యమునుండి కొందఱు ఇంగ్లండునకుఁ జనుదెంచి కొంచె కొంచెముగ దాని నాక్రమించుకొని పాలింపసాగిరి. వారిలో ముఖ్యులు ఆల్ ఫ్రె డ్డనుగొప్పరాజును, ఎడ్గరును, కాన్యూట్ ప్రభువును, మున్నగువారు. వీరిదొరతనమున నింగ్లం డొక యొడయనికి లోబడి యుండెను

నార్మనుదేశస్థు లింగ్లండునకు వచ్చి డేనుల నోడించి యింగ్లండు నాక్రమించుకొని యేలఁ దొడఁగిరి. వారిలో మిక్కిలిబలము కలవాఁడు విల్లియము. అతఁడు ఇంగ్లండురాజ్యము తనకు రావలయు నని గొప్పసేనను గూర్చుకొని యింగ్లండునకు నేతెంచి యందు రాజ్యము సేయుచుండినహారెల్డును జంపి యారాష్ట్రమును స్వాధీనము సేసికొని పాలింపసాగెను. ఈవిల్లియము వెనుక రెండవవిల్లియము, మొదటిహెన్రి, స్టీపను అనువార లింగ్లండు నేలిరి. వీరిపాలనలో నింగ్లండు కొంచెముగ మంచిస్థితికి వచ్చెను.