కొండ వేంకటప్పయ్య
సంగ్రహ ఆంధ్ర
గోల్కొండనవాబు ఈస్టిండియా కంపెనీవారికి కొండవీడును 1788 సెప్టెంబరులో అప్పగించెను. అప్పటినుండి కొండవీడు గుంటూరుజిల్లాలో చేర్చబడి, కొండవీటినుండి కార్యస్థానము గుంటూరునకు మార్చబడినది. కొండవీడొక తాలూకా కేంద్రముగా నుండినది. 1197వ ఫసలీలో ప్రభుత్వమువారు జమీందారులకు జమీలు పంపిణీ చేసిరి. అపుడు కొండవీడు చిలకలూరుపేటలో చేరిన శ్రీ రాజా మానూరి నరసన్నారావుగారికి సంక్రమించి, 1812 వరకు వారి వంశ్యుల స్వాధీనములో ఉండినది. జమీనుదారులకు అలవెన్సులు ఏర్పడినపుడు కొండవీడు రాష్ట్రదొరతనము వారి పాలనముక్రిందకు వచ్చినది. కాలక్రమమున కొండవీడు తాలూకా స్థానమును గూడ కోల్పోయి, ఒక గ్రామమై, తుదకు క్షీణించిపోయి, ఒక పల్లెగా మారినది.
కొండ వేంకటప్పయ్య :
కీ. శే. దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులుగారు ఆంధ్రజన మణిహారమున నాయకమణియై వరలెను. పంతులుగారి వినయసంపత్తి, మానవసేవాసక్తి, స్వతంత్ర కార్యాచరణశక్తి, దేశ సేవానురక్తి, ధైర్యోత్సాహ స్వార్థత్యాగౌదార్యములు మున్నగు నుత్తమ గుణములు వారు న్యాయవాది శిరోమణిగా, రాజకీయతంత్రవిశారదుడుగా, ఆంధ్రోద్యమ జనకుడుగా, దేశభక్తాగ్రేసరుడుగా రూపొందుటకు ప్రకృష్టోపకారకములయ్యెను.
గుంటూరు పట్టణమునందు ఒక బ్రాహ్మణ వంశమునందు కొండ అప్పయ్య అను మహాశయుడు ఉదయమందెను. అతడు వాసిరెడ్డి వారి సంస్థానమున రాజోద్యోగిగా నుండెను. అతని కొడుకు కోటయ్య. ఆతనికి పిత్ర్యముగా 15 ఎకరముల భూమి సంక్రమించెను. దానిపై రు. 30 ల ఆదాయము మాత్రమే లభించుచుండుటచే, ఆత డొక వైశ్యు నొద్ద ఉద్యోగిగ పనిచేయుచు తిమ్మరాజు గోపాలరావుగారి కూతురు బుచ్చమ్మ యను నామెను పెండిలియాడెను. ఆమె పరమసాధ్వి. సూర్యారాధనతత్పర. రవిని జూచి గాని కుడువ నొల్లనిది. కాలక్రమమున బుచ్చమాంబా కోటయార్యుల నోములపంటలై వేంకటప్పయ్య, సూర్యనారాయణ, ఆదినారాయణ అను ముగ్గురు కుమారు లుదయించిరి. వారిలో వెంకటప్పయ్యగారి శుభ జనన దినము 1866 సంవత్సరము ఫిబ్రవరి 2వ తేది శుక్రవారము. బుచ్చమ్మ తన 30 వ యేటనే పరమపదించెను. ఉపనీతులై యున్న వేంకటప్పయ్యగారే తల్లిగారి పరలోక క్రియలను నిర్వర్తించిరి.
పువ్వు పుట్టగనే పరిమళించు నన్నట్లు వేంకటప్పయ్యగారు విద్యాభ్యాసదశ నుండియే తమ ప్రతిభను ప్రదర్శింప దొడగిరి. వారు తొలుదొల్త ఒక మౌల్వీగారి పాఠశాలలో ఉరుదుభాష నభ్యసించిరి. పిదప ఒక ఆంగ్లేయ పాఠశాలలో ఆంగ్ల భాషాభ్యాసము నారంభించిరి. 1883 సం. డిసెంబరు మాసమున రాజమహేంద్రవరములో మెట్రిక్యులేషను పరీక్షయందు కృతార్థులైరి. అంతకు పూర్వముననే పంతులుగారు ఒక పాఠశాలా వార్షికోత్సవ సందర్భమున తమ వినోదకర సంభాషణ కౌశల్యముచే సభ్యులను హర్షాశ్చర్య మగ్నుల నొనర్చిరి. ప్రతి కక్ష్యయందును ఉన్నత శ్రేణిలో కృతార్థత నొందుచు నిరంతర విద్యార్థి వేతనమును, పుస్తకరూప బహుమానములను పొందుచుండిరి. రాజమహేంద్రవరమున నున్నప్పుడు వారికి కీ. శే. కందుకూరి వీరేశలింగముగారి దర్శనలాభము చేకూరెను. ఆంధ్ర భాషాధ్యాపకులగు కొండుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ప్రోత్సాహముచే, తెలుగు నాటకములలో ప్రముఖమైన స్త్రీపాత్రను సమర్థతతో నటించి ప్రేక్షకుల ప్రశంసలను చూరగొనిరి.
తమ సహపాఠియగు చంద్రశేఖరమను నాతనికి చికిత్స చేయించిన సందర్భమున కుగ్లరు దొరసానితో వారికి పరిచయ మేర్పడెను. ఆమెయొక్క సంఘసేవ, దైవభక్తి మున్నగుగుణములచే ఆకృష్టులైన పంతులుగారు క్రైస్తవమతా భిమానులు కాసాగిరి. క్రైస్తవమత ప్రవిష్టులయి యుందురు; కాని శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారిచే బోధితులై క్రైస్తవమత స్వీకరణోద్యమమునుండి విముఖులైరి.
ఉన్నత విద్యాభ్యాసము: పంతులుగారికి క్రైస్తవ మతమునందు జనించిన అభిరుచి పెంపొందు అవకాశము లేకుండ తండ్రిగారు వారిని ఎఫ్. ఏ. తరగతిని రాజమహేంద్రవరములో చదువునట్లు ఏర్పాటు కావించిరి. కాని ఎఫ్. ఏ. రెండవ సంవత్సరపు చదువు సాగించుటకు పంతులుగారు మదరాసులో క్రైస్తవ కళాశాలలో ప్రవేశించి, మితవ్యయ మొనర్చుచు, కుగ్లరు దొరసానిగారు
56