విజ్ఞానకోశము - 3
చెకోస్లోవేకియాదేశము (భూ)
త్వరలోనే ప్రెసిడెంట్ బినెస్ ప్రభుత్వ వర్గము నేషనల్ అసెంబ్లీయొక్క అభిమానమును కోల్పోయినది. 1948 లో అసెంబ్లీలో కమ్యూనిస్టులు అధిక సంఖ్యాకులై గోట్వాల్డు నాయకత్వమున నూతన ప్రభుత్వమును స్థాపించిరి. మరల దేశమున అంతఃకలహము చెలరేగినది. దేశాభ్యున్నతి కిది భంగకరమగునని తలచి, డా. బినెస్ రాజకీయ జీవితము నుండి విరమించుకొనెను. 1950 లో సోవియెట్ పద్ధతి ననుసరించి, చెకోస్లావేకియాలో, న్యాయపరిపాలనా విధానము మార్చబడినది.
1953 మార్చిలో, ఆన్టొనిన్ జపోటోకి అధ్యక్షుడయ్యెను. మరల 1957 లో జరిగిన ఎన్నికలలో ఆన్టోనిన్ నొవోట్నీ అధ్యక్షుడుగా ఎన్నుకొనబడెను. 1956 లో పోలెండు, హంగేరి దేశములలో చెలరేగిన అలజడుల ప్రభావము, చెకోస్లావేకియాలో గోచరింపకుండుట అభినందింప దగిన విషయము.
ఆర్. రా.
చెకోస్లోవేకియాదేశము (భూ) :
చెకొస్లోవేకియా దేశము మధ్యయూరపులో నున్నది. పశ్చిమమున, వాయవ్యమున జర్మనీ, ఉత్తరమున, ఈశాన్యమున పోలెండు, తూర్పున సోవియట్ రష్యా, దక్షిణమున ఆస్ట్రియా, హంగేరీ దేశములు చెకొస్లోవేకియాకు సరిహద్దులు.
ఈ దేశపు విస్తీర్ణము 49,366 చ. మైళ్ళు; 1957 లెక్కలనుబట్టి దీని జనాభా 1,31,61,542. ఈ దేశము పొడవుగా, ఇరుకుగానుండి, పశ్చిమమునుండి తూర్పునకు వ్యాపించియున్నది. ఆస్ట్రియా - హంగేరీ సామ్రాజ్య విచ్ఛిత్తియు, సన్నిహిత సంబంధముగల చెక్స్, స్లోవక్స్ అను జాతుల కలయికయు హేతువులుగా, 1918 వ సంవత్సరములో చెకొస్లోవేకియా ప్రజాస్వామిక రాజ్యము ఉదయించినది. 1918 - 1939 వరకు బొహీమియా, మొరేవియా, స్లోవేకియా ప్రాంతములును, ప్రస్తుతము సోవియట్ రష్యాలో భాగమైయున్న రుధీనియాయు కలిసి చెకొస్లోవేకియా ఒక ప్రజాస్వామిక ప్రభుత్వము (Republic) గా నేర్పడి యుండెను.
ఆరంభమునుండి ఈ దేశము పెక్కు క్లిష్ట సమస్యల నెదుర్కొనవలసిన దయ్యెను. ఆ సమస్యలు ప్రజాతంత్ర ప్రభుత్వముయొక్క స్థయిర్యమునకు, ఐక్యసాధనమునకు ప్రతికూలములై యుండెను. ద్వితీయ ప్రపంచ సంగ్రామ కాలమున (1939-1945) చెకొస్లోవేకియా జర్మను ప్రభుత్వ సేనల ఆక్రమణము క్రింద పెక్కు కష్ట నష్టములను అనుభవించెను. ఈ సంగ్రామానంతరము చెకొస్లోవేకియాకు దాస్య విముక్తి ఘటిల్లెను. తుద కీదేశము 1948 లో సామ్యవాద (Communist) దేశముగా మారెను. ఈ ప్రజాస్వామిక రాజ్యముయొక్క నామము చెక్కులు, స్లోవకులు అను రెండు ప్రధాన మానవ జాతి గణములను సూచించును. వీరి మధ్యగల మానవజాతి సంబంధ భేదములు స్వల్పములు.
భౌతిక లక్షణములు : ఈ దేశమును సహజమైన మూడు ప్రధాన ప్రాంతములుగా విభజించ వచ్చును : (1) పశ్చిమమున గల బొహిమియను పీఠభూమి. (2) మధ్యభాగమున నున్న మొరేవియన్ నిమ్న ప్రాంతము, (3) తూర్పున నున్న స్లోవక్ – కార్పేథియన్ పర్వతప్రాంతము. ఈ మూడు విభాగములు పరస్పర భిన్నములై వేర్వేరు భౌగోళిక - భౌతిక లక్షణములు కలిగి యున్నవి.
బొహీమియను పీఠభూమి : దీని ఆకారము పళ్ళెమువలె నుండును. ఇది అన్నివైపులయందును పర్వతారణ్యములచే ఆవరింపబడి యున్నది. నైరృతి దిశయందు బొహమర్ వాల్డ్, వాయవ్యమున ఎర్జ్ గేబెర్గ్ (Erzgeberge), ఈశాన్యమున సుడేటన్ (Sudetan), తూర్పున మొరేవియన్ పర్వతములు ఇందు చేరియున్నవి. ఈ ప్రాంతమున గల ఓహిరే (Ohre), బెరౌంకా (Beraunka), వటావా (Vatava), ఎల్బ్ (Elbe) నదులయొక్క పరీవాహ ప్రదేశములు అడవులతో కూడుకొనిన కొండలచే వ్యాప్తమై యున్నవి.
మొరేవియన్ నిమ్నప్రాంతము : ఇది ఒక ఏటవాలుగా నుండు పల్లపు ప్రాంతము. ఇది పశ్చిమమున నున్న బొహీమియను పీఠభూమికిని, తూర్పున నున్న స్లోవక్ - కార్పేధియన్ పర్వతములకును నడుమ నున్నది. ఇందులో విశేషభాగము విశాలమైన నిమ్నప్రాంతము. ఇది పశ్చిమమున గల మొరేవియన్ పర్వతముల దిశకును, తూర్పున నున్న కార్పేధియను పర్వతముల దిశకును క్రమముగా ఎత్తగుచుండును. డాన్యూబు నదికి ఉపనదియైన 'మార్చ్'
719