చెకోస్లావేకియాదేశము (చ)
సంగ్రహ ఆంధ్ర
జర్మనీ రాజకీయరంగములో హిట్లరుఅవతరించుటయు, చెకోస్లావేకియాలోని జర్మన్ దేశస్థులు 'సుడేటన్ జర్మనీ పార్టి 'ని స్థాపించుటయు, ప్రపంచ రాజకీయ రంగములో నాయకుల కొకవిధమైన మనో వైక్లబ్యము బయలు దేరుటయు, ప్రపంచశాంతి రక్షణలో 'నానా జాతి సమితి' విఫలమగుటయు, మున్నగు నంశములు చెకోస్లావేకియా రాజకీయ పరిస్థితిని మరింత సందిగ్ధ పరిస్థితి లోనికి దెచ్చినవి. ఇట్టి పరిస్థితులను పరిశీలించి, చెకోస్లావేకియాలో నాయకులు సుశిక్షిత సైనికదళములను తయారుచేయ నారంభించిరి. ఈ సంక్షోభము 1938 నుండి ప్రారంభ మయిన దనవచ్చును. 1938 లో జర్మనీదేశము ఆస్ట్రియాను వశపరచు కొన్నందున, చెకొస్లావేకియాకు మూడు వైపులను జర్మనీవారి ఆధిపత్యము సాగుచుండినది. ఇట్టి పరిస్థితిని పరిశీలించి, దేశములోని చిన్న చిన్న పార్టీలన్నియు 'సుడేటన్' జర్మన్ పార్టీ'లో కలిసిపోయినవి. 'నానాజాతి సమితి' లోని సంబంధ బాంధవ్యములను పురస్కరించుకొని గ్రేట్ బ్రిటన్, 1924 లో ఏర్పరచుకొనిన ఒడంబడిక ననుసరించి చెకోస్లొవేకియాను ఫ్రాన్సు రక్షింప వలసి యుండగా, ఈ దేశములేవియు ముందడుగు వేయజాలక పోయినవి. 1938 సెప్టెంబరు 29 తేదీన మ్యూనిక్ నగరములో జరిగిన సమావేశము ఫలితముగా చెకోస్లావేకియా దేశము విభజనకు గురియైనది. తత్ఫలితముగా సుమారు 16,686 చ. మైళ్ళను జర్మనీ, హంగేరీ, పోలండ్ దేశములకు చెకోస్లావేకియా కోల్పోయినది. దేశములో రాజకీయ పరిస్థితి మరింత కలుషితమై, మ్యూనిక్ సమావేశా నంతరము, ఆరునెలలలో చెకోస్లావేకియా మొదటి రిపబ్లిక్ అంతరించినది. డా॥ బినెస్ 1938 అక్టోబరు 5 వ తేదీన అధ్యక్ష పదవినుండి విరమించుకొనెను. హిట్లర్ స్లావేకియా, రుధేనియాలను స్వతంత్ర దేశములుగా ప్రకటించెను. తక్కిన భాగమునకు డా॥ ఎమిల్ హాచా అధ్యక్షుడుగా నియమింపబడెను. 1939 మార్చి 15వ తేదీ నాటికి జర్మన్ సైన్యములు ప్రేగ్ నగరము నాక్రమించినవి. ఆ సెప్టెంబరులో, చెలరేగిన ప్రపంచ సంగ్రామము నందు, చెకోస్లావేకియా వాసస్థులు, జర్మన్లకు యుద్ధము నందు సహాయముచేయ ప్రతిఘటించిరి. లండన్‌లో డా॥ బినెస్ చెకోస్లావేకియన్ నేషనల్ కౌన్సిలును పునః స్థాపించి, దానికి అధ్యక్షుడయ్యెను. మంత్రి మండలి, సైనిక దళము ఇత్యాది అంగములతో చెకోస్లావేకియా ప్రభుత్వ మొకటి లండన్ నగరమున ఏర్పడినది. ఈ ప్రభుత్వము సోవియట్ రాజ్యము, అమెరికా సంయుక్త రాష్ట్రములు, బ్రిటిష్ ప్రభుత్వముల అంగీకార ముద్రను పడసినది. 1940, 1941 లలో చెకోస్లావేకియాలో అంతఃకలహములు విపరీతముగా చెలరేగెను.
ఐక్యరాజ్య సమితి (United Nations organisation) పథకమునందు 1942 జనవరి 1 వ తేదీన పాల్గొన్న రాజ్యములలో లండన్‌లో స్థాపితమయిన చెకోస్లావేకియన్ ప్రభుత్వము ఒకటి. 1943 నుండి సోవియట్ ప్రభుత్వముతో దీనికి సంబంధములు బలపడి 1944 మేలో ఈ రెండు ప్రభుత్వములు చేసికొన్న నిబంధనల ఫలితముగా చెకొస్లావేకియా భూభాగములో రష్యన్ సేనలు అడుగు పెట్టినవి. తర్వాత ఒక సంవత్సరమునకు కొంత అమెరికన్ల సాయముతోను, స్వదేశములోని సైన్యముల సహకారముతోను, సోవియట్ సేనలు జర్మనుల ఆక్రమణనుండి చెకోస్లావేకియాను విడుదల చేసినవి. డా॥ బినెస్, అతని ప్రభుత్వము మరల ప్రేగ్ నగరమును చేరిరి.
మరల 1945 జూన్ 29 వ తేదీన చేసికొనిన ఒడంబడిక ననుసరించి రుథేనియా భూభాగము ఆ ప్రాంత వాసస్థుల "అభీష్టానుసారముగ" సోవియట్ రాజ్యములో చేర్చబడినది. దేశములోని ఆంతఃకలహములకును, సంక్షోభములకును కారకులయిన జర్మన్లు, హంగేరియన్లు వారి వారి దేశములకు పంపివేయబడిరి. ప్రపంచ సంగ్రామా నంతరము, 1946 లో చెకోస్లావేకియా దేశమున ఎన్నికలు జరిగినవి. రెండవ రిపబ్లిక్ ఏర్పడినది. దేశమున వివిధ రంగములలోని అస్థిరత్వమును పరిష్కరించుటకు ఈ ప్రభుత్వము నడుము బిగించి పరిశ్రమలను, వ్యవసాయమును, ఇతర సంస్థలను జాతీయ సంస్థలుగా మార్చి దేశములో ఆర్థిక సుస్థిరత్వమును నెలకొల్పుటకు యత్నించినది. సోవియట్ రాజ్యముతో గాఢమైన పొత్తు కలుపుకొన్నప్పటికిని, గ్రేట్‌బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రములతో చెకోస్లావేకియా తన బంధములను తెంపుకొనలేదు. సాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఐక్యరాజ్యసమితి (U.N.O.) సమావేశమునకు ప్రతినిధి వర్గమునుగూడ పంపినది. కాని
718