విజ్ఞానకోశము - 3 చిరుధాన్యములు
పశుగ్రాసమునకై సాగుచేయుచుందురు. చిరుధాన్యము లను చాలకాలము నిలవచేయుటకు వీలగును. వాటికి పురుగుపట్టుట చాల తక్కువ.
వివిధములైన చిరుధాన్య సస్యముల ముఖ్యలక్షణములును, వాటిని గూర్చిన కొన్ని ముఖ్యవిషయములును ఈ దిగువ క్లుప్తముగ వివరింపబడినవి : 1. జొన్న : జొన్న వన్యస్థితియందున్న కొండ చీపురు జాతినుండి పుట్టినదని కొందరి యూహ. దక్షిణభారత దేశమున ఈ సస్యము సుమారు వేయి వత్సరములు
చిత్రము - 194 జొన్న పెన్ను. పటము • 1
క్రితమే సాగులో నున్నదనుటకు నిదర్శనము లగుపడు చున్నవి. ఈ జాతి పైరునకు దక్షిణ ఇండియా గాని, ఆఫ్రికాఖండమున ఉష్ణ భాగములుగాని, ఆదిమస్థానములై యుండవచ్చును. ఇది దక్షిణ ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా మున్నగు తావులలో కొంత సేద్యములో నున్నది. జొన్న సాధారణముగా పిలకలను పెట్టదు. జొన్న గడ 4 అడుగులు మొదలు 10-12 అడుగుల యెత్తువరకు పెరుగును. కొన్ని రకములు 20 అడుగుల యెత్తువరకు కూడ నెదుగును. బాగుగా నెదిగిన జొన్న మొక్క కాండము 14 అంగుళముల లావును, సుమారు 10 కణుపుల పొడవును కలిగి యుండును. కాండము పై కఠినమగు చర్మమును, దాని లోపల బెండును ఉండును. జొన్న ఆకు సామాన్యముగ 2-8 అంగుళముల వెడల్పును, 24-30 అంగుళముల పొడవును కలిగియుండును. జొన్న వెన్ను ముద్దకంకిగా గాని, జల్లి కంకిగ గాని ఆయా రకపు స్వభావమునుబట్టి కనిపించును. సాధారణముగ జొన్నకంకి సుమారు 6-9 అంగుళముల పొడవును, 3-5 అంగుళములు లావును కలిగియుండును. గింజలపై నుండు పొట్టు, గింజల రంగు, వెన్ను వైఖరి, సాగుచేయు సమయము, ఫలించుటకు పట్టు కాలము మొద లగు లక్షణములను బట్టి జొన్న రకములు కొన్ని తరగతులు గను, ఉపతరగతులుగను విభజింపబడినవి. కృష్ణ రేగడ నేల లందును, ఎర్ర నేలలందును జొన్న విస్తారముగ సాగుచేయ బడును. ఇది చాలతక్కువ తేమతో పెరుగును. అందుచే సాధారణముగ దీనిని మెట్ట సస్యముగనే సాగుచేయు చుందురు.
ఇంగ్లీషు భాషలో జొన్న గ్రేట్ మిల్లెట్ (great millet) అనియు, లాటిన్ భాషలో 'ఆండ్రోపోగన్' (Andropogon) అనియు, సంస్కృతములో 'యావనాల', లేక 'వృత్తతండుల' అనియు వ్యవహరింపబడుచున్నది. జొన్న గింజలు వెగటుగ నుండును. కఫమును, పైత్యమును హరించును. వీర్యవృద్ధిని, బలమును కలుగజేసి, కామప్రకోపము కల్గించును.
2. గంటె : గంటెలను సజ్జలు అనికూడ వ్యవహరిం చుట కలదు. ఈ సస్యమునకు ఆదిమస్థానము ఆఫ్రికాఖండమని ఊహింప బడుచున్నది. సుమారు 300 సంవత్సరముల క్రిందట గంటెధాన్యము భారతదేశమున ప్రవేశ పెట్టబడి యుండవచ్చును, భారత, అరేబియా, ఈజిప్టు దేశములందు గంటె విస్తారముగ సాగులోనున్నది. దక్షిణ యూరపు