Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/764

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిరుధాన్యములు

సంగ్రహ ఆంధ్ర

లోను, అమెరికాలోగూడ ఈ సస్యము పండుచున్నది. గంటె మొక్కజొన్నకండె వలెనే యుండి, అంతకంటె సన్నముగనుండును. అది సుమారు 5-6 అడుగుల పొడవు పెరుగును. గంటె పిలకలను పెట్టి దుబ్బు కట్టును. ఒక్కొక్క దుబ్బులో సగటున 3-5 వరకు వెన్నువేయు పిలకలుండును. కాండము ½ మొదలు ¾ అంగుళము మందముండును. దీనిలో నుండు బెండు కొంచెము కఠినముగ నుండును. దీని కాండమునకు కూడ కనుపు లుండును. గంటె ఆకులలో కోటాకు క్రింది ఆకు తక్కిన వాటికంటే పెద్దదిగ నుండును. దాని తొడిమ 4-6 అంగుళముల పొడవును, రేకు 1½ మొదలు 2 అడుగుల పొడవును, సుమారు 1 అంగుళము వెడల్పును కలిగియుండును. గంటె వెన్ను 6 మొ. 12 అంగుళముల పొడవుండును. అది 'జమ్ము' కండెవలె నుండును. గంటె గింజలు జొన్నల కంటె చిన్నవి. గంటలో పెక్కురకములు సాగులో నున్నవి. గంటె ఉష్ణప్రదేశములలో తక్కువ తేమతో పెరుగును. దీనికి ఇసుక గరుములు అనుకూలమైన నేలలు. జొన్నలను వలెనే గంటెలను కూడ అన్నముగ వండి తినవచ్చును.

చిత్రము - 195

గంటె వెన్ను.

పటము - 2

గంటెను ఇంగ్లీషు భాషలో 'స్పైకెల్' (spikel) లేక 'పెరల్ మిల్లెట్' (pearl millet) అనియు, లాటిను భాషలో 'పెన్నిసెటమ్ టైఫాయిడెస్' (Pennisetum typhoides) అనియు వ్యవహరింతురు. దీని అన్నము స్వాదుగనుండి దేహమునకు పుష్టి నిచ్చును. హృద్రోగములకు పనిచేయును; ఆకలిని పుట్టించి పైత్యము నడచును.

3. చోడి : చోడిని 'రాగి' యనియు, 'తమిద' యనియు కూడ అనుచుందురు. చోడికి బహుళముగ భారతదేశమే ఆదిమస్థానమై యుండవచ్చును. చోడి పైరు భారత దేశములోను, ఆఫ్రికాలో తూర్పు, మధ్య, దక్షిణ భాగముల యందును విస్తారముగ సాగులో నున్నది.

చిత్రము - 196

చోడి వెన్ను.

పటము - 3

చోడి మొక్క గంటెమొక్కవలెనే దుబ్బుకట్టును. సామాన్యముగ ఇది 24 అడుగుల ఎత్తు పెరుగును. దీని కాండము కొంచెము బల్లపరుపుగను, మృదువుగను ఉండును. చోడి కాండము బోలుగ నుండును. దీని కనుపుల నుండి పిలకలు బయలు దేరును. చోడి ఆకులు దళసరిగ నుండును. ఆకునకు గల తొడిమ సుమారు 4-6 అంగుళముల పొడవుగను, రేకు 12-20 అంగుళముల పొడవుగను ఉండును. చోడి కంకికి సాధారణముగ 4-6 రెల్ల లుండును. వీటిలో నొకటి విడిగా క్రిందుగా నుండును. దీనిని 'బొటనవ్రేలు' అనియు, తక్కినవాటిని 'వ్రేళ్లు' అనియు సామాన్యముగ పిలుతురు. ఈ వ్రేళ్ల పొడవు ముద్దరకములలో 1½ మొ. 4 అంగుళములును, రెల్ల రకములలో 3 మొ. 6 అంగుళములును, ఉండవచ్చును. కొన్ని చోడి రకములలో