Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/713

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చారిత్రక భౌతికవాదము

దూరముగ నున్నది. ఇక రెండవ సిద్ధాంతము : గతించిన 2 వేల సంవత్సరములలో ఇంగ్లండుయొక్క శీతోష్ణస్థితిలో పెద్దమార్పులు కానరావు. కాని ఆదేశము అన్నిదశలను దాటి ఈనాడు పెట్టుబడిదారీ ప్రజాస్వామికదశయం దున్నది. తత్తుల్యమైన శీతోష్ణస్థితిగల అట్లాంటిక్ దీవులలో కొందరు ఇప్పటికిని ఆటవికస్థితిలో జీవించుచున్నారు. ఈ అంశమువలన భౌగోళిక, శీతోష్ణస్థితిగతులు చరిత్ర పరిణామమును నిర్ధరించునను ప్రతిపాదనముగూడ సరి యైనది కాజాలదు.

బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదులవంటి ప్రవక్తలు, గాంధివంటి ఆధ్యాత్మిక, రాజకీయ నాయకులు, అలెగ్జాండరు, నెపోలియనులను బోలు మహావీరులు వారివారి కాలములలో చరిత్రగమనముపై గణనీయమైన ప్రభావము కల్గించినమాట వాస్తవమే. అయినను కేవలము వీరిచర్యలే కీలక ప్రాధాన్యము కలిగి, చరిత్రను తీర్చిదిద్దిన వనుట సమంజసముగ కన్పట్టదు. వారి ప్రబోధములు, వారి చర్యలు, చారిత్రక గమనముపై వారి సిద్ధాంతములు క లుగజేయు ప్రభావము పరిణామసిద్ధాంతములకు అనుగుణ్యముగ నున్నంతవరకు మాత్రమే అభ్యుదయ పాత్రమును వహించి, అటుపిమ్మట అభ్యుదయమును నిరోధించుటయుగూడ సంభవము గావచ్చును.

ప్రతి మానవునియందు గర్భితముగ నుండు మానవత్వము, పశుత్వము అను శక్తులనడుమ జరుగు సంఘర్షణ ఫలితముననే సమాజము పురోగమించుచున్నదని కొందరు తత్వవేత్తలు ప్రతిపాదించియుండిరి. హెగెల్ ప్రతిపాదించిన 'అఖండభావము' (world spirit) నకును, అరవిందుని 'ఉన్నతమానవ' (Super man) భావమునకును సన్నిహితసంబంధ మున్నట్లు గోచరించును. దీనినిబట్టి హెగెల్ సిద్ధాంతమునందువలెనే అరవిందుని సిద్ధాంతమునందు గతితార్కిక లక్షణములు ద్యోతకములగును. అనగా ఆంతరంగిక వైరుధ్యముల (internal contradictions) వలననే పురోగమనము సాగగల దాని వీరుగుర్తించిరి. అయినను ప్రత్యక్ష వాస్తవమైన మానవుని భౌతికజీవితములో గల ఈ వైరుధ్యములను వీరు గమనించక, కేవలము భావప్రపంచములో విహరించుటచే వీరి దృక్పథమునందు ప్రధానమైన దోషము లేర్పడినవి. హెగెల్ సిద్ధాంతములోని గతితార్కిక దృక్పథము తలక్రిందయినది; కాగా, హెగెల్ ప్రతిపాదించిన మూలసిద్ధాంతమును ఆతని అనంతరము జన్మించిన మార్క్స్ స్వీకరించి, దానియందలి గుణదోషములను సరిదిద్ది, తలక్రిందైన దృక్పథమును సవ్యముగా నిలబెట్టి, మానవుని భౌతికజీవితమునకు గతితార్కిక సిద్ధాంతమును అనువర్తింపజేసెను. పైన వివరించిన నాలుగు సిద్ధాంతములు చరిత్ర పరిణామమునకు గల మూలకారణములను వివరించక, వాటిని మరుగుపరచుచున్నట్లు తోచుచున్నది. చారిత్రక భౌతికవాదము వాటిని వెలికిదీసి, చరిత్ర గమనమును శాస్త్రీయముగ వివరింపగల్గుచున్నది.

ఇంతవరకు మానవసంఘము వివిధ దశలలో పరిణామముచెంది సామ్యవాద వ్యవస్థవరకు పురోగమించినది. సమాజ పరిణామమునకు వర్గ సంఘర్షణము కీలకమని తెలిసికొనియున్నాము. ప్రపంచమందు అన్ని దేశములలో సామ్యవాదవ్యవస్థ నెలకొనిన పిమ్మట వర్గవైరుధ్యములు, వర్గసంఘర్షణములు అంతరించునుగదా! అట్టిచో, పరిణామక్రమము ఆగిపోవునా? అను ప్రశ్న ఉత్పన్నము కావచ్చును. ఉత్పత్తిశక్తుల (productive forces) అభివృద్ధికి అనుగుణ్యముగా ఉత్పత్తి సంబంధములను (productive relations) మార్చుకొని అభ్యుదయమును సాధించుటవలననే మానవసంఘము పురోగమించును. పూర్వచరిత్రలో ఇది ఎంత వాస్తవమో, భవిష్యత్ చరిత్రలోకూడ ఇది అంత యధార్థము. కాని పూర్వ చారిత్రకదశలలో విభిన్నములైన వర్గములు విభిన్నములైన స్వప్రయోజనములకొరకు పోరాడుచుండెడివి. వర్గ పోరాటముల వలన, విప్లవముల వలన, యుద్ధముల వలన జననష్టము ఘటిల్లిన అనంతరము, పరస్పర విరుద్ధములైన వర్గములనడుమ ఒక విధమైన తాత్కాలిక సమన్వయము మాత్రమే సాధ్యమయ్యెను. వర్గరహితమైన సామ్యవాద వ్యవస్థ అవతరించుటతో మానవజాతి క్రమముగా అంధకారమునుండి వెలుగులోనికి ప్రవేశించగలదని విజ్ఞులగు చారిత్రక భౌతికవాదులు వచించియున్నారు. అంతర వైరుధ్యముల వలననే మానవజాతి పురోగమించు ననెడి చారిత్రక భౌతికవాద సిద్ధాంతము సామ్యవాద వ్యవస్థకు కూడ వర్తించును. అయితే ఆ వైరుధ్యముల స్వరూపస్వభా

653