Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/712

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారిత్రక భౌతికవాదము

సంగ్రహ ఆంధ్ర

మునకు ఇట్టి చారిత్రకోదాహరణములు పెక్కులు గలవు. గతితార్కిక సూత్రములను చరిత్రకు వర్తింపజేయుట ద్వారా చారిత్రక దేహాత్మవాదము రూపొందుచున్నదని సోదాహరణముగా ఇంతవరకు తెలిసికొనియున్నాము.

వర్గశీలమైన సమాజమేర్పడిన పిమ్మట ప్రజలలో వర్గ దృక్పథ మేర్పడును. ఈ దృక్పథమే వివిధవర్గముల యొక్క, ఉపవర్గములయొక్క మతవిశ్వాసములయందు, ఆచార సంప్రదాయములయందు, తాత్విక ధోరణుల యందు, సాహిత్య, సాంస్కృతిక, కళాత్మక, నైతిక జీవితవిధానములయందు ప్రతిబింబించుచు వచ్చినది. పారిశ్రామిక నాగరికత భారతదేశములో 19 వ శతాబ్ది యందు మొలకెత్తినది. కులభేదములయెడ నిరసన, స్త్రీ పురుష సమానత్వము నెడల ఆదరాభిమానములు, అంటరానితనము పట్ల ఏవగింపు మున్నగు అభ్యుదయభావము లేర్పడినవి. ఈ భావములు బహుళముగ ప్రచారమై దేశమంతట ప్రచండమైన భావసంచలనముకల్గినది. ఈ ఉద్యమ ప్రచారమునకు సాహిత్యమొక ప్రబలమైన సాధనముగా ఉపకరించినది. ప్రజల సమస్యలను ప్రజల కర్ధమయ్యెడి భాషలలో వ్రాయబడుటచే, ప్రాంతీయ భాషాసాహిత్యముల స్వరూప స్వభావములలో విప్లవము ప్రవేశించినది. కనుక ఆర్థిక, రాజకీయవిధానములకు, సామాజిక జీవిత క్రమమునకు, భావసంచలనమునకు సన్నిహితమైన సంబంధ ముండుననియు, ఆర్థిక పునాదులు మారినపిమ్మట, దానితో పాటు ఉపరితల నిర్మాణము (Super structure) నందలి అంగములు, ఉపాంగములు కొంచెము వెనుకముందుగా పరివర్తనము చెందుట అనివార్యమనియు బోధపడగలదు. అయితే భావప్రపంచమందలి అంతస్తు లన్నియు ఒక్కసారిగా తలక్రిందులుకావు; చిరకాలమువరకు అవి నూతన వ్యవస్థను ఆశ్రయించుకొనియుండును. ఇందులకు ఈనాటి సామ్యవాదరాజ్యములే ప్రత్యక్షోదాహరణములు.

చారిత్రక భౌతికవాదము ప్రతిపాదితమై ప్రచారమున కెక్కకపూర్వము, కొందరు ప్రముఖ చరిత్రకారులు చరిత్రపరిణామమును వివరించుచు కొన్ని సిద్దాంతములను ప్రతిపాదించియుండిరి. జనసాంద్రతను బట్టి దేశచరిత్ర నిర్థరింపబడునని మొదటి సిద్ధాంతము. భౌగోళిక స్థితిగతులచే చరిత్రపరిణామము ప్రభావితమగునని రెండవసిద్ధాంతము, మహా పురుషుల ప్రబోధములవలన నూతన భావములు ప్రజలలో మొలకలెత్తి చరిత్ర పరిణామమునకు దోహద మొనర్చునని మూడవ సిద్ధాంతము, మానవునిలో గర్భితమైయున్న ఆధ్యాత్మిక శక్తుల అభ్యుదయ క్రమమే మానవ సమాజ చరిత్ర యని, అజ్ఞానమునుండి సుజ్ఞానములోనికి, అల్పత్వము నుండి అఖండ చైతన్యము లోనికి జీవాత్మగావించు నిరంతరప్రయాణమే చరిత్ర పరిణామమునకు హేతుభూతమని నాల్గవసిద్ధాంతము వక్కాణించు చున్నది. ఈ నాల్గింటిలో కడపటి రెండు సిద్ధాంతములు తుల్యప్రాధాన్యము కలిగియున్నవి. ఈ తుది వాదనను 18 వ శతాబ్దియందు ఐరోపాలో జన్మించిన హెగెల్ అను సుప్రసిద్ధ తత్వవేత్తయు, భారతీయ తత్వవేత్తలలో అగ్రేసరుడైన అరవింద యోగియు ప్రతిపాదించి యుండిరి.

జనసాంద్రత అధికముగ నున్న దేశములు ఎల్లకాలములలో నాగరికతా సౌధమందు అగ్రస్థాయిలో నుండ గలవను వాదములో సత్యము కానరాదు. ఈ వాదము ననుసరించి అన్ని దేశములలోకెల్ల అత్యధిక జనసంఖ్యగల చైనా, ఆ తర్వాత భారతదేశము అభ్యుదయశ్రేణి యందు ప్రథమ ద్వితీయస్థానము లాక్రమించవలసి యుండగా, వాస్తవస్థితి ఈనాడు ఇందుకు భిన్నముగ నున్నది. కాగా, జనసంఖ్య దృష్ట్యా, మూడవస్థానమునం దున్న రష్యా, సామ్యవాద సామాజిక వ్యవస్థయందు సమగ్రముగను సర్వతోముఖముగను పురోగమించు చున్నట్లు తెలియుచున్నది.

వెనుకటి చరిత్రను పరిశీలించినను ఈ విషయమే బోధపడగలదు. ఈజిప్టు బాబిలోనియా, హరప్ప, మొహంజదారో శిథిలముల మూలమున ఆయా జాతుల ప్రజలు మానవచరిత్రలో ప్రప్రథమముగ నాగరికతాపథములో అడుగిడినట్లు స్పష్టమగుచున్నది. వారందరు ఆదిమసమాజ వ్యవస్థయందు జీవించుచుండిరి. క్రమముగా ఆనాగరికత కాలగర్భమున కలిసిపోయినది. అటుపిమ్మట ఇటలీ, గ్రీసు దేశములలో బానిస నాగరికత (slave civilization) ప్రభవించి క్రీస్తు శకారంభముతో అదికూడ అంతరించెను. అందుచే జనసాంద్రత అధికముగ నున్న దేశములు మాత్రమే మహోన్నతమైన నాగరికతను సాధించి, చరిత్ర గమనములో పురోభాగమున నుండు ననెడి వాదన సత్య

652